కుటుంబ సమస్యలతో బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సమస్యలతో బలవన్మరణం

Jun 23 2026 10:24 AM | Updated on Jun 23 2026 10:24 AM

నిడమనూరు : కుటుంబ సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కమ్మంపాటి శ్రీనివాస్‌(38) కుటుంబంలో గొడవల కారణంగా కొంతకాలంగా అతడి భార్య లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్‌ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

మర్రిగూడ : మండలంలోని అజ్జలాపురం గ్రామానికి చెందిన యువకుడు విద్యుత్‌ స్తంభాలు నాటేందుకు కూలీకి వెళ్లిన ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. అజ్జలాపురం గ్రామానికి చెందిన విజయ, లచ్చిరాం దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు నేనావత్‌ గణేష్‌(20) జీవనోపాధి కోసం విద్యుత్‌ స్తంభాలు నాటే పనికి వెళ్తుండేవాడు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కందుకూరు గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు నాటుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు గణేష్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

మట్టపల్లిలో దొంగల బీభత్సం

సిమెంట్‌ పరిశ్రమ ఉద్యోగుల క్వార్టర్స్‌లో చోరీ

బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి వద్ద గల నాగార్జున సిమెంట్స్‌ పరిశ్రమ కాలనీలో తాళం వేసిన ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సిమెంట్స్‌ పరిశ్రమ కాలనీలోని ఏడుగురు ఉద్యోగులు తమ క్వార్టర్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊళ్లకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి క్వార్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. సోమవారం బాధిత ఉద్యోగి మోదాల గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించినటులపేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్‌నగర్‌ సీఐ చరమంద రాజు పరిశీలించి బాధిత ఉద్యోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

మునుగోడు : బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం గూడపూర్‌ గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన బండారు రఘు(56) బట్టల వ్యాపారి. కోర్టు పని నిమిత్తం సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం బైక్‌పై మునుగోడుకు వస్తుండగా.. మార్గమధ్యలో వర్షం కురవడంతో బైక్‌ వేగం కాస్త పెంచాడు. అంతేకాకుండా బైక్‌ పెట్రోల్‌ ట్యాంకుపై బట్టల బ్యాగు పెట్టుకొని వస్తుండగా.. గూడపూర్‌ గ్రామ శివారులోకి రాగానే బైక్‌ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి తల, ముఖంపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

భర్త మృతి.. భార్యకు గాయాలు

రామన్నపేట : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భర్త మృతిచెందాడు. భార్యకు గాయాలయ్యాయి. ఈ ఘటన రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నీర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య(40) కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం తన భార్య పూజతో కలిసి ద్విచక్ర వాహనంపై రామన్నపేట వైపు వెళ్తుండగా.. నీర్నెముల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి భార్య పూజ చెయ్యి విరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement