● స్కూటీ డిక్కీలో పెట్టిన డబ్బులు అపహరించిన దుండగులు
రామన్నపేట : ఎరువుల దుకాణం ముందు రైతు పార్కింగ్ చేసిన స్కూటీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.60వేల నగదు అపహరించాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన చిరబోయిన నర్సింహ సోమవారం రామన్నపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో గోల్డ్‌లోన్ తీసుకున్నాడు. లోన్ డబ్బు మొత్తం ఒకేసారి డ్రా చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో రూ.50వేలు డ్రా చేశాడు. వాటితో పాటు తన వద్ద ఉన్న మరో రూ.10వేలు కలిపి కవర్‌లో వేసి తన ఎలక్ట్రిక్ స్కూటీ డిక్కీలో పెట్టి గ్రోమోర్ సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని యూరియా తీసుకునేందుకు ఫర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లాడు. స్కూటీని షాపు ముందు పార్కింగ్ చేసి లోపలికి వెళ్లాడు. బ్యాంకు వద్ద నుంచి అతడిని అనుసరించి వచ్చిన నలుగురు వ్యక్తుల్లో ఒకరు నర్సింహకు స్కూటీ కనబడకుండా అడ్డుగా నిలబడగా.. మరో వ్యక్తి స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి కవర్‌ను తీశాడు. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి అతడిని ఎక్కించుకొని వెళ్లాడు. షాపు వద్ద అమర్చిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కవర్‌లో నగదుతో పాటు భూమి పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. డబ్బు అపహరించిన వ్యక్తుల్లో ఒకరు బ్యాంకులో నర్సింహ లోన్‌కు సంబంధించిన ఓచర్ రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారు బ్యాంకు నుంచే నర్సింహను అనుసరించినట్లు గ్రోమోర్ సెంటర్, ఫర్టిలైజర్ షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సమాచారం తెలుసుకున్న రామన్నపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
పిడుగు పడి గొర్రెల కాపరి మృతి
చిట్యాల : పిడుగుపడి గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. వట్టిమర్తి గ్రామానికి చెందిన సంగబుడ్డి నాగరాజు(32) గొర్రెలు కాసేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో కురిసిన భారీ వర్షానికి నాగరాజు సమీపంలో పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తిరుమలగిరి (సాగర్) : గేదెలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలంలోని బోయగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక మల్లయ్య (45) రోజుమాదిరిగా సోమవారం కూడా గేదెలను మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లగా.. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పదేళ్ల క్రితమే మరణించగా.. ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌నగర్‌లో పేకాట స్థావరంపై సోమవారం టూటౌన్ పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశామని సీఐ తెలిపారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.6,500 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


