పెద్దవూర : ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులు వరి నారుమడులు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలను(140–150 రోజులు) జూన్ 25వ తేదీ వరకు, మధ్యకాలిక రకాలను(135 రోజులు) జూలై 10 వరకు, స్వల్పకాలిక రకాలను(125 రోజులు) జూలై 31 వరకు నార్లు పోసుకునేందుకు అనుకూలమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచిస్తున్నారు. . ఆగస్టు 15వరకు అన్నిరకాల వరినాట్లు పూర్తి చేయాలని ఆయన పేర్కొంటున్నారు.
● పొలంలో నీరు ఆగకుండా ఉండే, చౌడు లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వరి నారు పోసుకోవాలి.
● నారు పోసుకునే పొలాన్ని 15–20 రోజుల ముందే 2 నుంచి 3 సార్లు దున్నుకోవాలి.
● నారు పోసుకునే పొలంలో ఎకరా నారుమడి ప్రాంతానికి 200 కిలోల కుళ్లిన పశువుల ఎరువును వేసుకోవాలి.
● కిలో విత్తనానికి 1 గ్రాము కార్భండిజమ్ లేదా 2.5 గ్రాముల థైథినియం యం–45 మందును కలుపుకోవాలి.
● విత్తనాన్ని 1–24 గంటలు నానబెట్టి, 24–36 గంటలు మండె కట్టి తర్వాత మొలక విత్తనాన్ని పొలంలో చల్లుకోవాలి.
● ఎకరా నారుమడికి 2.2 కిలోల యూరియా, 6.25 కిలోల సూఫర్, 1.25 కిలోల పొటాష్(ఎంపీఓ) మొదటలో చల్లుకోవాలి.
● ఎకరాకు 15–20 కిలోలు మొలక వచ్చిన గింజలను రకాలను బట్టి చల్లుకోవాలి.
● పొలంలో మొలక విత్తనాన్ని సమానంగా చల్లుకుని పలుచగా నీళ్లు పెట్టి తర్వాత రోజు ఉదయాన్నే నీరు తీసివేయాలి.
● పొలంలో అడపాదడపా నీళ్లు పెడుతూ నారు మొలక ఆకుల దశ వచ్చిన తర్వాత 2–3 సెంటీమీటర్ల మందంలో నీరు ఉంచాలి.
● కలుపును బట్టి నారు మడుల్లో 12–15 రోజుల మధ్యలో లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల బిన్‌ఫైరిబాక్ సోడియం మందును, 15–20 రోజులకు 1.5 మిల్లీలీటర్లు సైహలోఫాస్ బ్యూటైల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
● నారు పీకే 5–7 రోజుల ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరా నారుమడిలో వేయడం వలన ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
● నారులో జింక్ లోపం కనబడితే లీటరు నీటిలో 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుపై పిచికారీ చేసుకోవాలి.


