ఆధునిక యంత్రాల సాగుతో లాభాలు
పంటల ఉత్పాదకత పెరుగుతుంది
తక్కువ ధరకు ఎరువులు.. నాణ్యమైన విత్తనాలు
● అద్దెకు ఆధునిక వ్యవసాయ
పరికరాలు
● స్వయం సమృద్ధి దిశగా రైతులు
కట్టంగూర్ : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కేంద్రం(ఎఫ్‌పీఓ) రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను తక్కువ ధరకు అందిస్తోంది. అంతేకాకుండా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ పరిధిలోని గంగదేవిగూడెంలో ఏర్పాటు చేసిన ఈ కట్టంగూర్ ఎఫ్‌పీఓ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన కార్బన్ మింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవసాయంలో యాంత్రీకరణ పెంపొందించేందుకు ‘రైస్ 360’ అనే ప్రాజెక్టును కట్టంగూర్ మండలంలో అమలు చేస్తోంది. ఈ సంస్థ గత సీజన్‌లో కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం, గార్లాయిగూడెం, కురుమర్తి, అయిటిపాముల, తేలువారిగూడెం, గంగదేవిగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో 450 ఎకరాల్లో రైస్ 360 ట్రయల్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వానాకాలం సీజన్‌లో 4500 ఎకరాలకు విస్తరించటమే లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్‌లో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు కార్బన్ మింట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పిండిప్రోలు వెంకట్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఒకే చోట ఎరువులు, విత్తనాలు,
ఆధునిక యంత్రాలు..
కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కేంద్రం ఆధ్వర్యంలో గంగదేవిగూడెంలో ఒక దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులో ఎరువులు, విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచారు. కట్టంగూర్ ఎఫ్‌పీఓలో సభ్యత్వం ఉన్న రైతులకు మార్కెట్ ధరల(ఎంఆర్‌పీ) కంటే తక్కువ ధరకే వరి విత్తనాలు, యూరియా, దుక్కిపిండి, రసాయన ఎరువులను అందిస్తున్నారు. అయితే ఫెస్టిసైడ్స్, సీడ్స్ తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ ఫర్టిలైజర్స్ ధరల విషయంలో మాత్రం బయటి మార్కెట్‌కు, ఇక్కడికి ఎలాంటి మార్పు లేదు.
అందుబాటులో ఆధునిక పరికరాలు..
చిన్న, సన్నకారు రైతులు భారీ ధర పెట్టి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయలేరు. ఈ సమస్యను గుర్తించిన కట్టంగూర్ ఎఫ్‌పీఓ.. కార్బన్ మింట్ సంస్థ సహకారంతో ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రోటావేటర్, సీడ్ డ్రిల్, డ్రై సీడర్, రోటో పడ్లర్, స్లాషర్, రోటోవీడర్, బూమ్ స్ప్రేయర్, డ్రోన్ స్ప్రేయింగ్, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్, బండ్ ప్లాస్టర్ వంటి ఆధునిక యాంత్రాలను రైతులకు అద్దెకు ఇస్తున్నారు. ఎఫ్‌పీఓ కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఛార్జీలు ఒకేలా ఉండగా.. 10 కిలోమీటర్లు దాటితే డీజిల్‌కు అయ్యే ఖర్చును రైతు అదనంగా భరించాల్సి ఉంటుంది. డ్రోన్ ద్వారా మందుల పిచికారీకి ఎకరాకు రూ.100 డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
పారదర్శకంగా నిర్వహణ..
ఈ ఎఫ్‌పీఓ కేంద్రంలో ఎరువులు, విత్తనాల నిర్వహణ ఎంతో పారదర్శకంగా సాగుతుంది. ప్రతిరోజు రైతులు ఏఏ యంత్రాలను తీసుకెళ్లారు, ఏయే రకాల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారనే వివరాలను పక్కాగా రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. రైతుల నుంచి వచ్చిన నగదును, అద్దె డబ్బులను ఎప్పటికప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసి పక్కా అకౌంటింగ్ విధానాన్ని పాటిస్తున్నారు. భవిష్యత్‌లో రైతులకు పెట్టుబడి కష్టాలు రాకుండా ఉండేందుకు స్వల్పకాలిక రుణాలు(పెట్టుబడి రుణాలు) అందించే దిశగా ఎఫ్‌పీఓ ముందుకెళ్తుంది.
ఎఫ్‌పీఓలో సభ్యత్వం లేని రైతులు అదనంగా
రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి ఉంది.
యంత్రం పేరు ఎఫ్‌పీఓ సభ్యులకు ఇతరులకు
రోటావేటర్ (ఎకరాకు) 1900 2000
స్రైడర్ (ఎకరాకు) 170 200
సీడ్ డ్రిల్ (ఎకరాకు) 1200 1500
డ్రై సీడర్ (ఎకరాకు) 1700 1800
రోటో పడ్లర్ (గంటకు) 1900 2000
స్లాషర్ (ఎకరాకు) 700 800
రోటో వీడర్ (ఎకరాకు) 1100 1200
బూమ్ స్ప్రేయర్ (ఎకరాకు) 300 400
డ్రోన్ స్ప్రేయింగ్ (ట్యాంక్‌కు) 350 400
ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ (ట్యాంక్‌కు) 800 900
ఆధునిక యంత్రాల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. రైతులు కూలీల కొరతతో ఇబ్బంది పడకుండా యంత్రాలు చాలా ఉపయోగకరంగా మారాయి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పంటలు పండించే రైతుకు లాభం, ప్రజలకు ఆరోగ్యం అందించటమే మా లక్ష్యం. రైతుకు, వినియోగదారుడికి మధ్య పారదర్శకమైన, బలమైన బంధాన్ని నిర్మించేందుకు మా సంస్థ కృషి చేస్తుంది.
– పిండిపోల్రు వెంకట్, కార్బన్ మింట్
రైస్ 360 సంస్థ వ్యవస్థాపకుడు
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆధునిక యంత్రాలతో పనులు వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవడంతో పాటు సమయం ఆదా అవుతుంది. కూలీల కొరత ఉన్న సమయంలో కూడా పనులు సకాలంలో నిర్వహించడానికి వీలవుతుంది. ఆధునిక యంత్రాల వినియోగంతో పంటల ఉత్పాదకత పెరగటంతో పాటు రైతుల శ్రమ తగ్గుతుంది.
– పామనగుండ్ల శేఖర్, రైతు బొల్లేపల్లి
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, సరైన ఎరువులు ఎంతో ముఖ్యం. నాణ్యమైన విత్తనాలు ఉపయోగిస్తే మొలకశాతం ఎక్కువగా ఉండి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. భూమి స్వభావానికి అనుగుణంగా ఎరువుల వాడకంతో పంట దిగుబడి పెరిగి రైతులకు లాభసాటిగా మారుతుంది. వ్యవసాయ సాగులో సమతుల్య ఎరువుల వినియోగం అవసరం.
– చెవుగోని సైదమ్మ, కట్టంగూర్ ఎఫ్‌పీఓ చైర్మన్


