సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం తాజాగా తెచ్చిన 22–ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులను తొలగించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన పేదల ఇళ్లను తొలగించాలని భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. గత అక్టోబర్ 11న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన వ్యవసాయ భూములు, నివేశన స్థలాలను రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22–ఏలో చేర్చింది. వీటి క్రయవిక్రయాలు జరుగకుండా నిషేధించడంతో ప్రజలు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన సానుకూలంగా స్పందించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అయితే తమ ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించాలని ప్రజలు కొంతకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే.
మంత్రి ఆదేశాలూ అమలు కాలే..
22–ఏ జాబితాలో ఉన్న ఇళ్లను తొలగించాలని రాప్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు నేటికీ అమలు కాలేదు. నెల రోజుల క్రితం హైదరాబాద్‌లో గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలతో గృహనిర్మాణ, రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. నిషేధిత జాబితాలో ఉన్న పేర్లను తొలగించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
అత్యధిక ఇళ్లు భువనగిరిలో..
జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో కలిపి 319 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాలో 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీటన్నింటిని 22–ఏ జాబితాలో చేర్చారు. అత్యధికంగా ఇళ్లు భువనగిరిలో ఉండగా, తర్వాత తుర్కపల్లి, పోచంపల్లి, చౌటుప్పల్, వలిగొండ, ఆలేరు, రామన్నపేట, యాదగిరిగుట్ట ఉన్నాయి. అలాగే అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో పేదలకు గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో అవసరాలకు ఇళ్లు అమ్ముకోలేని దుస్థితిలో పేదలు ఉన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములివే..
రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22–ఏ ప్రకారం నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు చేర్చారు. ఇళ్లతోపాటు 2450 సర్వే నంబర్లలో 28,549 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. వీటీతో పాటు సీఐడీ, సిట్, ఆర్‌ఆర్, ఏసీబీ కేసుల్లో ఉన్న భూములు 258 ఎకరాలు, ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇవేకా అసైన్డ్ భూములు, భూదాన్, ఇనామ్, వక్ఫ్, దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు, అటవీ భూములు, రోడ్లు, శ్మశానాలు కూడా ఉన్నాయి.
ఆందోళన బాటలో ప్రజలు
నిషేధిత జాబితా నుంచి తమ ఇళ్లను తొలగించాలని ప్రజలు పలుచోట్ల రోడ్కెక్కి ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేశారు. తమ ఇళ్లను నిషేధిత జాబితానుంచి తొలగించాలని పట్టుబట్టారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, భూములు
మండలం ఇళ్లు భూములు
(ఎకరాల్లో..)
ఆలేరు 1,606 25
భువనగిరి 5,000 342
తుర్కపల్లి 4,803 4,229
అడ్డగూడూరు 1,041 3,185
బి.రామారం 1,832 782
చౌటుప్పల్ 3,173 15
రామన్నపేట 2,529 5,796
రాజాపేట 1,946 3,352
యాదగిరిగుట్ట 2,576 1,643
వలిగొండ 2,894 1,465
మోత్కూరు 1,995 390
బీబీనగర్ 1,220 1,452
మోటకొండూరు 1,895 975
గుండాల 1,730 1,065
ఆత్మకూర్(ఎం) 1,616 820
పోచంపల్లి 2,519 1,061
ఫ సీఎం, మంత్రి ఆదేశించినా కార్యరూపం దాల్చలే..
ఫ పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్
ఫ ఎమ్మెల్యేలను వేడుకుంటున్న పేదలు


