యాదగిరిగుట్ట : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజు కు చేరింది. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్మికులు నల్ల బ్యాడ్జీలు, నోటికి నల్ల రిబ్బెన్లు ధరించి, మృతి చెందిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్లెక్సీతో మౌన ర్యాలీ నిర్వహించారు. మూడవ రోజు సైతం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుటే ఉంటూ బస్సులను బయటకు రాకుండా ఆందోళన చేశారు.తమ హక్కులను సాధించుకునేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్య యత్నాలకు పాల్పడవద్దని, బతికి ఉండే హక్కులను సాధించుకుంద్దామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపో గేట్ దాటి బయటకు రాలేదు.
రోడ్డెక్కిన 29 ప్రైవేట్ బస్సులు..
ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు 29 అద్దె బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. తాత్కాలింగా ఆరుగురుకండక్టర్లు, 10 మంది డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్నామని డిపో అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ వాహనాలే దిక్కు..
సమ్మె కారణంగా బస్సులు నడకపోవడంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తుల రాక తగ్గింది. కొందరు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చినా తిరుగు ప్రయాణంలో ప్రైవవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. ఇదిలా ఉండగా కొండపైకి పలు స్కూల్స్‌కు చెందిన బస్సులను ఆలయాధికారులు నడిపిస్తున్నారు.
ఫ మూడో రోజూ కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఫ అద్దె బస్సులను నడిపించిన అధికారులు


