
భూనిర్వాసితులకు అండగా నిలుస్తాం
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు అండగా నిలుస్తామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ.రామారావు హామీ ఇచ్చారు. భూనిర్వాసితులతో శుక్రవారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉత్తర, దక్షిణ భాగాలకు చెందిన నిర్వాసితుల సమస్యలు, డిమాండ్‌లను అడిగి తెలుసుకున్నారు. రైతులు, భూ నిర్వాసితులు చేస్తున్నది న్యాయ పోరాటమన్నారు. నిర్వాసితులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు. కొందరి ప్రయోజనాల కోసం రీజినల్ రింగ్‌రోడ్డును వంకలుగా తిప్పారని ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి రైతులను రోడ్డున పడేస్తూ పారిశ్రామిక వేత్తలు, బడాబాబుల కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ నెల 21న మరోసారి నిర్వాసితులు, రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, పల్లె రవికుమార్, పార్టీ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్, నాయకులు సుర్వి యాదయ్య, దబ్బటి రాములు, భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి కేటీఆర్