
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
యాదగిరిగుట్ట రూరల్: సైకిల్‌ను వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన గిరెడ్డి హనుమంతరెడ్డి (65) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్ద పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రాజాపేట మండలం నుంచి యాదగిరిగుట్ట వైపునకు వెళ్తున్న కారు అతివేగంతో, హనుమంతరెడ్డి సైకిల్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారుతో ఢీ కొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి చెందిన కనకయ్యగా గుర్తించినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు.