
కీటకాలు.. పంటలకు హితకారులు
పెద్దవూర: సాలీడు పురుగులు, మిడతలు, తూనీగలను రైతు మిత్రులు, పంట రక్షిణులు, పంట కాపరులు అని అన్నదాతలు పిలుస్తుంటారు. బస్తాల కొద్దీ రసాయనిక మందుల్ని పంట పొలాల్లో గుమ్మరించటం వలన ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. తగిన మోతాదులో మందుల్ని వాడకుండా ఇష్టారాజ్యంగా వాడితే ఇవి పూర్తిగా చనిపోయి దుష్ఫలితాలు ఏర్పడతాయని మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ సూచిస్తున్నారు. పంటలకు మిత్రులైన వీటిపై ఆయన సలహాలు..
ఎగిరే శత్రువులకు సింహస్వప్నం
మిడతలు, చిలకలు, సీతాకోక చిలుకలు వంటి ఎగిరే ప్రాణుల్ని ఈ సాలీడు ఆరగించదు. ఆలస్యంగా స్థిరపడినప్పటికీ అన్ని రకాల పర్యావరణాల్లోనూ ఈ సాలీడు మనగ గలదు.
శత్రు గుడ్లను కబళించే అక్షంతల పురుగులు
నెమ్మదిగా సంచరించే పురుగులను ఇవి తింటాయి. బయటకు కనిపించే వివిధ జాతి శత్రు పురుగుల గుడ్లను కబళిస్తాయి. ఇవి చురుగ్గా కదులుతూ పిల్ల గొంగళి పురుగులు, పచ్చదోమ పిల్ల పురుగులు, కనిపించే గుడ్లను భక్షిస్తాయి. ఇది పచ్చదోమ, సుడిదోమ పిల్లలను ప్రీతిగా తింటుంది. వీటి పిల్ల పురుగులూ అతి తిండిపోతులుగా చెప్పవచ్చు.
ఈ సాలీడుకు దవడలెక్కువే
మాగాణి భూముల్లో ఉండే ఈజాతి సాలీళ్లు మధ్యాహ్న సమయంలో వరి పైరులో సేదదీరి ఉదయాన్నె గూటిలో మాటు వేసి, గూటిని తాకే ఎగిరే ప్రాణుల్ని అమాంతం ఆక్రమించి సిల్కుతో చుట్టేసి ఆరగిస్తాయి.
రాత్రిళ్లు వేటాడే భక్షక మిడత
ఎదిగిన పైరులో రాత్రి వేళల్లో చురుగ్గా సంచరించి కాండం తొలిచే పురుగు గుడ్లు, వరి నల్లనల్లి గుడ్లు, పచ్చదోమ, సుడిదోమ పిల్లల్ని కబళిస్తుంది. యవ్వన మిడతలు అలికిడి విన్నంతనే వెంటనే ఎగిరిపోతాయి. ఒక్కో భక్షక మిడత రోజుకు 3, 4 కాండం తొలిచే పురుగుల గుడ్ల సముదాయాల్ని భక్షించగలదు.
శత్రు పురుగుల్ని తినే సాలీళ్లు..
దీపపు పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలుచు పురుగు, పెద్ద రెక్కల సీతాకోక చిలుకలను, ఉల్లికోడు, వరి ఈగలను, రెల్లరాల్చు పురుగు, సుడి దోమలను ఎంతో సులువుగా సాలీళ్లు భక్షిస్తాయి. ఒక్కో సాలె పురుగు 5–15 వరకూ శత్రు కీటకాలను ఒక రోజులో తినగలదు.
కీటకాలు, దోమల శత్రువులు తూనీగలు
పెద్ద, చిన్న తూనీగలు రంగురంగుల ఉలిపిరి రెక్కలతో మొక్కల పైభాగమునకు దిగువగా ఎగురుతూ ఎగిరే కీటకాలు, దోమ పిల్లల కోసం వెతుకుతూ ఉంటాయి. వీటి పిల్ల పురుగులు నీటిలో ఆవాసం ఉంటాయి. వరి కాండంపై సులభంగా సంచరిస్తూ పిల్ల దోమలను వేటాడుతాయి.
శత్రువులను అదుపు చేసే తోడేలు సాలీడు
వరి పిలకల దశలో ఈ జాతి సాలీళ్లు ఎక్కువగా మొదళ్ల మధ్య సంచరిస్తాయి. మాగాణి భూములు, మెట్ట వరి పొలాల్లో శత్రు పురుగులపై దాడి చేసి పంట నష్టపరిచే స్థాయికి ఎదగకుండా అదుపు చేస్తాయి.
శత్రు పురుగుల తరాన్ని
నివారించే శివంగి సాలీడు
కొత్త తరం పెంపొందకుండా శత్రు పురుగులను నివారించడంలో ప్రధాన భూమికను పోషిస్తుంది శివంగి సాలీడు.
పొట్టిదైనా గట్టి సాలీడు
ఈ సాలీళ్లు నీటి మట్టంపైన వరి పిలకల మొదళ్ల మధ్య నల్లి గూళ్లలో చిక్కిన పచ్చదోమ, సుడిదోమ పిల్లలను ఆరగిస్తాయి.
ముసుగు యుద్దం చేసే దుమికే సాలీడు
చుట్టుకుపోయిన ఆకులోనే చిన్నపాటి గూడును ఏర్పరచుకుని మరో ఆకును కూడా అల్లుకుని దాక్కుని, దీపపు పురుగుల కోసం నిరీక్షిస్తుంది. అదును దొరికాక సంహరిస్తుంది.

కీటకాలు.. పంటలకు హితకారులు