
ప్రతినెలా ‘మధ్యాహ్నం’ బిల్లులు
ఆలేరురూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీ నిర్వాహకుల బాధలు తీరనున్నాయి. ఇకనుంచి ప్రభుత్వం ప్రతినెలా నిర్వాహకులకు గ్రీన్ చానల్ యాప్ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించనుంది. ప్రస్తుతం జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఐదు నెలల వంట బిల్లులు, ఆరు కోడిగుడ్ల బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. కొత్త విధానాన్ని త్వరలోనే అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
తరగతుల వారీగా నిధులు
జిల్లాలోని 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 36,218 మంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఒక్కొక్కరికి రూ.6.19, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వారికి రూ.9.29, తొమ్మిది నుంచి పదో తరగతి వారికి రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అదనంగా కోడిగుడ్డుకు రూ.6, గౌరవ వేతనం కింది నిర్వాహకులకు రూ.మూడు వేలు చెల్లిస్తుంది. వంట బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60శాతం భరిస్తుంది.
బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
ప్రస్తుతం ఉన్న బిల్లులు చెల్లింపుల విధానంతో మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు ఎదురుచూపుల బాధలు తప్పడం లేదు. గౌరవ వేతనాలు, బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి మధ్యాహ్న భోజనం బిల్లులు ప్రభుత్వం సక్రమంగానే జమ చేస్తుంది. 9, 10 తరగతి విద్యార్థులకు సంబందించిన బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులు చేసి వంట చేయాల్సిన వస్తుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు చెల్లించాలని వంట నిర్వాహకులు కోరుతున్నారు.
గ్రీన్ చానల్ విధానం అమలయితే..
గ్రీన్ చానల్ విధానం అయితే మధ్యాహ్నం భోజనం బిల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెలా ఆన్‌లైన్ యాప్ ద్వారా నేరుగా ఖాతాలో జమ చేస్తారు. ఏడాది మొత్తానికి అవసరమైన బిల్లులకు నిధులు కేటాయిస్తారు. విద్యాశాఖ ప్రస్తుతం మధ్యాహ్న భోజనానాకి సంబంధించిన వివరాల నమోదు కోసం యాప్ రూపొందించింది. ప్రస్తుతం అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రీన్ చాలన్ విధానం అమల్లోకి వస్తే ప్రతినెలా ఏ పాఠశాలలో ఎంత మంది కార్మికులకు ఎంత బిల్లు చెల్లించాలనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానోపాధ్యాయులు ఆమోదం తెలిపిన తర్వాత, ఎంఈఓ సరిచూసుకుని ఆమోదిస్తే ట్రెజరీ ద్వారా ప్రతినెలా నిర్వాహకుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
ఫ గ్రీన్ చానల్ యాప్ ద్వారా
చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం
ఫ ఇక నుంచి పెండింగ్‌లో
పెట్టకుండా అందజేత
ఫ తీరనున్న వంట కార్మికుల ఇబ్బందులు
పాఠశాలలు విద్యార్థులు
ప్రాథమిక పాఠశాలలు 484 15,112
ప్రాథమికోన్నత 68 3,218
ఉన్నత 163 17,888