
సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతైన విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలం సుంకిశాలతండాకు చెందిన కేళావత్ శ్రీనునాయక్(45) ఐదేళ్లుగా పెద్దవూర మండలం పొట్టివానితండాలో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొట్టివానితండాకు చెందిన రమావత్ దత్తు శుక్రవారం శ్రీనునాయక్ పత్తి చేనులో అరక తోలడానికి వచ్చాడు. అయితే దత్తు కుమార్తె అంజలికి కొంతకాలంగా ఆరోగ్యం బాగుండకపోవడంతో అతడి భార్య, మరో వ్యక్తి కలిసి అంజలిని అల్వాల గ్రామఽ శివారులోని సాగర్ ఎడమ కాలువ పక్కన దర్గా వద్ద గల బావూజీ(మంత్రగాడు) వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని దత్తు శ్రీనునాయక్‌కు చెప్పి.. తాను అరక తోలుతున్న కావున శ్రీనునాయక్‌ను బావూజీ వద్దకు వెళ్లాలని కోరాడు. దీంతో శ్రీనునాయక్ బావూజీ పూజలు చేసే ప్రదేశానికి వెళ్లి దత్తు కుమార్తె అంజలికి పూజలు చేయించారు. అనంతరం దత్తు కుమార్తె అంజలికి స్నానం చేయించడానికి ఆమెతో పాటు శ్రీనునాయక్ సాగర్ ఎడమ కాలువలోకి దిగాడు. బాలిక స్నానం చేస్తున్న క్రమంలో కాలుజారి కాలువలో పడిపోయింది. శ్రీనునాయక్ గమనించి వెంటనే కాలువలోకి దూకి బాలికను ఒడ్డుకు చేర్చాడు. అనంతరం శ్రీనునాయక్ ఒడ్డుకు వస్తున్న క్రమంలో అప్పటికే అలసిపోయిన అతడు నీటి ప్రవహానికి కాలువలో కొట్టుకుపోయాడు. ఎంత గాలించినా శ్రీనునాయక్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి భార్య బుజ్జి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపారు.