
నీటి కరువు తీర్చిన నిజాం చీఫ్ ఇంజనీర్
డిండి: డిండి ప్రాజెక్టు నిజాం కాలంలో నిర్మించబడి నేటికీ వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. కృష్ణానదికి ఉపనది అయిన దుందుబి నది పరివాహాక ప్రాంతంలో సాగు, తాగునీటి కష్టాలను దూరం చేయాలనే ఆలోచన నిజాం కాలం నాటి చీఫ్ ఇంజనీర్ ఖాజా అజీమొద్దీన్ మదిలో మెదిలింది. దీంతో దుందుబి వాగు ద్వారా వృథాగాపోతున్న నీటిని నిల్వ చేసేందుకు ప్రాజెక్టును నిర్మించాలని ఆయన అప్పటి నిజాం రాజు దృష్టికి తీసుకెళ్లారు. అజీమొద్దీన్ ఇంజనీరింగ్ ప్రతిభతో 1940–43 మధ్య కాలంలో రూ.34.36 లక్షలు ఖర్చుచేసి హైదరాబాద్–శ్రీశైలం వెళ్లే మార్గంలో డిండి మండల కేంద్రంలో పెద్ద పెద్ద బండరాళ్లు, గచ్చుతోటి ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి వర్షాధారం పైనే ఆధారపడి నిండుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 12500, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల ఆయకట్టు సాగుకు నీరందిస్తోంది. డిండి ప్రాజెక్టు పూర్తికాగా మిగిలిన డబ్బుతో డిండి మండల కేంద్రానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో డిండి నుంచి దేవరకొండకు వెళ్లే మార్గంలో బాపన్‌కుంట వద్ద అజీంఘడ్ అనే కోటను కూడా నిర్మించారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న కోట అందాలను చూసేందుకు నిత్యం వస్తున్న పర్యాటకులు వస్తుంటారు.