
నకిలీ జామీను పత్రాలు సృష్టిస్తున్న ఇద్దరి అరెస్ట్
భువనగిరిటౌన్ : నకిలీ జామీను పత్రాలు తయారుచేస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనుగూడెం గ్రామానికి చెందిన తిరుగమల్ల సోమయ్య, ఖమ్మంకు చెందిన సింగిరెడ్డి విజయ్‌భూపాల్‌రెడ్డి కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శుల పేరిట నకిలీ రబ్బరు స్టాంపులు తయారుచేసి నల్లగొండలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఖాళీ ఇంటి టాక్స్ రశీదు పుస్తకాలు, విలువైన ఆస్తి పత్రాలు సేకరించారు. నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తూ నకిలీ డాక్యుమెంట్స్ రూపొందించి నిందితులకు స్వయంగా జామీను ఇవ్వడం, సీజ్ అయిన వాహనాల విడుదలకు నకిలీ డాక్యుమెంట్స్ అందజేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు వారిద్దరిని శుక్రవారం రాత్రి భువనగిరిలోని లాడ్జిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు 24 నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించినట్టు పోలీసులు వివచారణలో తేలింది. వారిద్దరిని శనివారం రాత్రి కోర్టులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

నకిలీ జామీను పత్రాలు సృష్టిస్తున్న ఇద్దరి అరెస్ట్