
ఆలేరు అభివృద్ధికి మోక్షం
డీపీఆర్ తయారీలో కన్సల్టెన్సీ
త్వరలో టెండర్లు పిలుస్తాం
ఆలేరు: ఆలేరు పట్టణవాసుల అవస్థలు తీరనున్నాయి. మున్సిపల్ ఖజనాలో మూలుగుతున్న తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్‌ఐడీసీ) నిధులు రూ.15 కోట్లు ఖర్చు చేయడానికి కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అభివృద్ధి పనులకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పాటు మున్సిపాలిటీకి చెందిన మరో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు తాజాగా ప్రతిపాదనలు పంపించారు.
రూ.12 కోట్లతో చేపట్టనున్న పనులు ఇవీ..
అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఓపెన్ నాలాల వల్ల ఇళ్లు, కాలనీల మధ్య మురుగు నిలిచి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరహా సమస్యలు పరిష్కరించేందుకు టీయూఎఫ్‌ఐడీసీ నిధుల్లో రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు.
మున్సిపల్ భవనానికి రూ.3 కోట్లు
రూ.3 కోట్లు మున్సిపల్ భవన నిర్మాణానికి వెచ్చించనున్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ చాంబర్లతోపాటు విశాలమైన కౌన్సిల్ సమావేశ మందిరం, సెక్షన్ల వారీగా సిబ్బంది గదులు రానున్నాయి. పాత పంచాయతీ కార్యాలయం వద్ద భవన నిర్మాణానికి శిలాఫలకం వేసిన సంగతి తెలిసిందే.
టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే కాంట్రాక్టు శ్రీవెంకటేశ్వర కన్సల్టెన్సీ దక్కించుకుంది. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల సూచన మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో కన్సల్టెన్సీ ఉంది. మొత్తం మూడు సంస్థలు పోటీ పడ్డాయి.
టీయూఎఫ్‌ఐడీసీ నిధులకు వీడిన గ్రహణం
ఫ రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
ఫ మరో రూ.15 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
మున్సిపల్ శాఖ వద్ద డీపీఆర్ ఆమోదం పొందగానే టెండర్లు ఆహ్వానిస్తాం. అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలల్లో పూర్తికానుంది.
– శ్రీనివాస్, ఆలేరు మున్సిపల్ కమిషననర్