
భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భర్త
మిర్యాలగూడ టౌన్: భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. బుధవారం మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం లచ్చతండా గ్రామానికి చెందిన పానుగోతు సందీప్ కుటుంబంతో కలిసి గత నాలుగేళ్లుగా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా సందీప్‌కు మానసికస్థితి సరిగా ఉండటంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 8న అతడు భార్య పద్మతో గొడవపడి మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో నివాసముంటున్న తన బావమరిది నేనావత్ గోవింద్ ఇంటికి వెళ్లాడు. సందీప్ చిన్న కుమారుడు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా.. అతడి వద్దకు వెళ్తానని చెప్పడంతో సందీప్‌ను అతడి బావమరిది గోవింద్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో దించాడు. అనంతరం సందీప్‌కు కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఎంత వెతికినా సందీప్ ఆచూకీ లభించకపోవడంతో అతడి తమ్ముడు పానుగోతు మేఘా బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.