
సాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. ప్రస్తుతం 70,038 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్ల ద్వారా 16,012 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,277 క్యూసెక్కులు మొత్తం 48,289 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలలకు 21,819 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నీటిమట్టం 589.10 అడుగులు (309.3558 టీఎంసీలు)గా ఉంది.
రోడ్డు ప్రమాదంలో
ఒకరి దుర్మరణం
● మరో ఇద్దరికి గాయాలు
గరిడేపల్లి, మేళ్లచెరువు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం యర్రకుంట తండాకు చెందిన భూక్య భగ్యా(60) తన కుమారుడు భూక్య కృష్ణ, బంధువు ధరావత్ కమిలితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ మండలం అవంతిపురం సంతకు గొర్రె పొట్టేళ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ బేరం కుదరకపోవడంతో తిరిగి హుజూర్‌నగర్ మీదుగా యర్రకుంట తండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హుజూర్‌నగర్ నుంచి మిర్యాలగూడ వైపు కారులో అతివేగంగా వెళ్తున్న కుమ్మరికుంట ప్రణయ్ గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ శివారులో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భూక్య భగ్యా మృతిచెందాడు. కృష్ణ, కమిలిని మెరుగైన వైద్యం కోసం కోదాడకు తరలించారు. మృతుడి భార్య భూక్య తిర్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనతో యర్రకుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివాహేతర సంబంధం
పెట్టుకున్నాడని దాడి
మేళ్లచెరువు: భార్యను వదిలి వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై అతడి భార్య తరఫు బంధువులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఖాజామియా తన భార్యను వదిలి వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి మంగళవారం భార్య తరఫు బంధువులు ఖాజామియాపై దాడి చేశారు. తన భార్యతో పాటు వారి బంధువులే తనపై దాడికి కారణమని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.