
కొత్త కార్డులకూ పథకాలు
భువనగిరిటౌన్ : కొత్త రేషన్‌కార్డులు పొందిన వారికి సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. పదేళ్లుగా రేషన్ కార్డులు వరకు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో వివిధ పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. వీరితో పాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
నూతనంగా 11,759 కార్డులు జారీ
ప్రజాపాలన గ్రామసభలు, మీ సేవ కేంద్రాలు ద్వారా 95,637 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేసినఅధికారులు 11,759 కార్డులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు 2,16,831 కార్డులు ఉన్నాయి. నూతనంగా మంజూరైన కార్డులు, గతంలో కార్డులు కలిగి పథకాలు అందని కుటుంబాలు దరఖాస్తు చేసుకునే ప్రభుత్వం అవకాశం కల్పించింది.
దరఖాస్తు విధానం ఇలా..
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయాల్లో, పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలి. సబ్సిడీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు జిరాక్స్‌లతో పాటు గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలను కౌంటర్లలో సమర్పించాలి. దరఖాస్తు సంఖ్యను ప్రజా పరిపాలనలో కూడా కలిగి ఉండాలి. అప్పుడే పథకాలకు అర్హత పొందుతారు. కాగా ప్రస్తుతం వెబ్‌సైట్‌లో సబ్సిడీ గ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని, గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఉచిత గృహ విద్యుత్, సబ్సిడీ గ్యాస్ వర్తింపు
ఫ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
ఫ మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
ఫ గతంలో దరఖాస్తు చేసుకోనివారికీ అవకాశం
లబ్ధిదారుల్లో ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేసింది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో రూ.500కు వంట గ్యాస్, గృహజ్యోతిలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి రేషన్‌కార్డు తప్పనిసరి చేసింది. దీంతో కార్డులేని కుటుంబాలు పథకాలు పొందలేకపోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది.
నూతన రేషన్ కార్డులు
మండలం కార్డులు
ఆలేరు 971
ఆత్మకూర్ 299
బి.రామారం 300
గుండాల 302
మోటకొండూరు 446
తుర్కపల్లి 857
రాజాపేట 558
యాదగిరిగుట్ట 881
భువనగిరి 573
భువనగిరి టౌన్ 598
బీబీనగర్ 478
పోచంపల్లి 816
వలిగొండ 1418
చౌటుప్పల్ 540
నారాయణపురం 1168
రామన్నపేట 927
అడ్డగూడూరు 72
మోత్కూరు 555

కొత్త కార్డులకూ పథకాలు