నీటి సంపులో దూకి వివాహిత ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా జూలకల్లు మండల కేంద్రానికి చెందిన జంజనం వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతులు 30ఏళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి కుమారుడు మల్లికార్జున్ గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసముంటూ జ్యూయలరీ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మల్లికార్జున్‌కు పల్నాడు జిల్లా కూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన నాగమణి(25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సరైన పనిలేక మల్లికార్జున్ పుట్టపాకలో తన తండ్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పనులను చూసుకోవడానికి భార్య నాగమణితో కలిసి వారం క్రితం వచ్చాడు. వీరి కుటుంబంతో కొంతకాలంగా పలు విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగమణి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జగన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నాగమణిని తన తల్లింద్రడుల దగ్గరకి పంపించకపోవడం, ఆమెకు సెల్‌ఫోన్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


