ఆలగడప బాలుడు.. భారత గ్రాండ్‌మాస్టర్‌ | Sakshi
Sakshi News home page

ఆలగడప బాలుడు.. భారత గ్రాండ్‌మాస్టర్‌

Published Tue, May 16 2023 9:44 AM

- - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల ప్రణీత్‌ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ సాధించాడు. భారతదేశం నుంచి ఈ గణత సాధించిన 82వ ఆటగాడిగా ప్రణీత్‌ నిలిచాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం నుంచి 5వ గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందాడు. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు ఎలో రేటింగ్‌ పాయింట్లు 2500 దాటాలి. అయితే అజర్‌బైజాన్‌లో జరిగిన బకూ ఓపెన్‌లో టోర్నీలో ప్రణీత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించిన ప్రణీత్‌ 15 ఏళ్ల వయస్సులో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారి గ్రాండ్‌మాస్టర్‌ ఘనత సాధించిన ప్రణీత్‌కు పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు, ఆలగడప గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లో స్థిర నివాసం
మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసచారి, ధఽనలక్ష్మి దంపతుల కుమారుడు ప్రణీత్‌. శ్రీనివాసచారి కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (సీటీఓ)గా, ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొనేళ్లు క్రితం వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆలగడపలో వీరికి సొంత ఇల్లు, భూ ములు ఉన్నాయి. ప్రతి పండుగకు, శుభకార్యాలకు, సెలవుల్లో స్వగ్రామానికి వస్తుంటారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణీత్‌ చెస్‌లో రాణిస్తున్నాడు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చినా.. కుమారుడి కెరీర్‌ ఆగిపోవద్దనే ఉద్దేశంతో వారు ఫ్లాట్‌ను సైతం విక్రయించి ప్రణీత్‌ చెస్‌లో రాణించేందుకు అండగా నిలిచారు. విదేశాల్లో టోర్నీల శిక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఓటమి ఎదురై ప్రణీత్‌కు నిరాశ కలిగినా.. పట్టుదలతో విజయాల వైపు సాగిపోయాడు. 2021 వరకు రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్‌, ప్రస్తుతం ఇజ్రాయిల్‌కు చెందిన కోచ్‌ విక్టర్‌ మెకలెవిస్కి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.

ప్రణీత్‌ సాధించిన విజయాలు
► అండర్‌–7లో రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచాడు.

► 2015లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీఎం టోర్నీలో 220 ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించి ఒకే ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పాయింట్లు గెలిచిన ఆటగాడిగా జాతీయ రికార్డు సృష్టించాడు.

► అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.

► 2018లో అండర్‌–11లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు.

► 2021లో అండర్‌–14 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.

► ఆసియా దేశాల ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో స్వర్ణం సాధించాడు.

ఎంతో సంతోషంగా ఉంది
చెస్‌ను ఆన్‌లైన్‌లో ఆడడం కంటే, నేరుగా బోర్డుపై ఆడడానికే ప్రాధాన్యమిస్తా. బిల్జ్‌, ర్యాపిడ్‌ కంటే క్లాసికల్‌ విభాగం అంటేనే నాకిష్టం. బలమైన ప్రత్యర్థిపై గెలుపుతో పాటు గ్రాండ్‌ మాస్టర్‌ హోదా కూడా దక్కింది. గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐదున్నరేళ్ల వయస్సులోనే చెస్‌ ఆడటం మొదలెట్టా. చిన్నప్పుడు టెన్నీస్‌ ఆడేవాడిని. ఈతలోను ప్రవేశం ఉంది కానీ ఓ రోజు నాన్న చెస్‌ ఆడతుండగా చూసి ఆసక్తి కలిగింది. నా ఇష్టాన్ని గమనించి అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. కార్ల్‌సన్‌ను ఆరాధిస్తా. ఇక నా రేటింగ్‌ను 2800కు పెంచుకునేందుకు కృషి చేస్తున్నా. ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్‌లో దేశానికి పతకం అందించడమే నా లక్ష్యం.
– ఉప్పల ప్రణీత్‌, గ్రాండ్‌ మాస్టర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement