న్యూస్‌రీల్
ఆకివీడులో 28 వార్డులు
నరసాపురంలో 36 వార్డులు
శురకవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: పుర పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. 18 వరకు మూడు రోజులు పాటు నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 17న సప్తమి కలిసిరావడంతో ఆ రోజున అధిక శాతం నామినేషన్లు వేయనున్నారు. నరసాపురంలో చైర్మన్ అభ్యర్థిత్వంపై కూటమి పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు.
తొలి విడతలో..
జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న నరసాపురం మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళ, ఆకివీడు నగర పంచాయతీ బీసీ మహిళకు రిజర్వయ్యాయి. గతంలో వార్డు కౌన్సిలర్లుగా పనిచేసిన పలువురు మాజీ ప్రతినిధులు ప్రస్తుత ఎన్నికల్లో బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొత్తగా బరిలోకి దిగే ఆశావహులు ఓటర్లు, సామాజిక, ఆర్థికపరమైన అంశాలను బేరీజు వేసుకుంటూ తమకు అనుకూల వార్డులపై కన్నేశారు.
కూటమిలో తేలని పంచాయితీ
నామినేషన్ల స్వీకరణ మొదలుకానుండగా కూటమిలో సీట్లు సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. తమకు పట్టున్న జిల్లాగా చెప్పుకునే పశ్చిమలోని అధిక స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలపాలని జనసేన స్థానిక నాయకత్వం భావిస్తోంది. తొలి విడతలోని నరసాపురంతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం తదితర మున్సిపాల్టీల్లో చైర్మన్ పదవులను జనసేన కావాలంటున్నట్టు సమాచారం. సీట్ల సర్దుబాటు అయినట్టు జనసేన అధినాయకత్వం ప్రకటించగా ఎన్ని సీట్లు?, ఎక్కడెక్కడ పోటీలో ఉంటుంది? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం ఆ పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. ఏ వార్డును ఏ పార్టీకి కేటాయించాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనే అంశంపై పొత్తు చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది.
నరసాపురంలో సందిగ్ధం : నరసాపురం చైర్పర్సన్ అభ్యర్థి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. టీడీపీ, జనసేన అంతర్గత విభేదాలు ఇక్కడ తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. ఇటీవల మొగల్తూరులో జరిగిన ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే గారూ మీ పనితీరు బాగోలేదు’ అంటూ స్థానిక ఎమ్మెల్యే నాయకర్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రజల ముందు కించపర్చడాన్ని జనసేన కేడర్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆకివీడులో కూటమి అభ్యర్థుల ఎంపికలో నియోజకవర్గ నాయకత్వం తీరుపై సొంత కేడర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తమకు తెలియకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారంటున్నారు. ఇక్కడ జనసేన ఎనిమిది, బీజేపీ రెండు వార్డులను కేటాయించాలని కోరుతున్నట్టు తెలిసింది.
గెలుపు గుర్రాల అన్వేషణలో..
సూపర్‌సిక్స్ అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చేసిన వంచనతో కూటమి పట్ల ప్రజల్లోని తీవ్ర వ్యతిరేకత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణ స్థానిక ఎన్నికల్లో తమకు అఖండ విజయాన్ని అందిస్తాయని వైఎస్సార్సీపీ కేడర్ భావిస్తోంది. నరసాపురం, ఆకివీడులో స్థానికంగా పట్టున్న వారిని చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులుగా పలువురి పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్టు సమాచారం.
సప్తమి పూట మంచిదని..
నామినేషన్ల స్వీకరణకు మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహులు ముహూర్తాల వేటలో పడ్డారు. 17న సప్తమి తిథి అత్యంత బలమైనదిగా, కలిసివచ్చే రోజుగా పంచాంగకర్తలు సూచిస్తుండటంతో అధిక శాతం మంది అభ్యర్థులు ఆ రోజే నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఆకివీడులో 28 వార్డులకు గాను ఎస్టీ జనరల్‌గా 20వ వార్డు, ఎస్సీ మహిళకు 17వ వార్డు, ఎస్సీ జనరల్‌కు 1, 28 వార్డులు, బీసీ మహిళలకు 5, 9, 12, 18, 22 వార్డులు, బీసీ జనరల్‌కు 4, 11, 15, 21, 25 వార్డులు, అలాగే జనరల్ మహిళలకు 3, 6, 10, 13, 14, 19, 23, 27 వార్డులు, జనరల్‌కు 2, 7, 8, 16, 24, 26 వార్డులు కేటాయించారు.
నరసాపురంలోని 31 వార్డులు పునర్విభజనలో 36కు పెరిగాయి. వీటిలో 24వ వార్డు ఎస్టీలకు రిజర్వు కాగా 32, 33 వార్డులు ఎస్సీ మహిళలకు, 22, 34 వార్డులు ఎస్సీ జనరల్‌కు, 2, 3, 5, 10, 15, 19 వార్డులు బీసీ మహిళలకు, 1, 9, 13, 16, 20, 28, 30 వార్డులు బీసీ జనరల్‌కు, 4, 7, 8, 11, 12, 14, 17, 18, 23, 29 వార్డులు జనరల్ మహిళలకు, జనరల్‌కు 6, 21, 25, 26, 27, 31, 35, 36 వార్డులు రిజర్వు చేశారు.
నేటి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ
జిల్లాలో నరసాపురం మున్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు
గెలుపు గుర్రాల వేటలో రాజకీయ పక్షాలు
నరసాపురం కూటమిలో తేలని పంచాయితీ
17న అధిక సంఖ్యలో నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు


