రూ.కోట్లు కుమ్మరించాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కుమ్మరించాల్సిందే!

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

● భీమవరం కూటమిలో నేతల వెనుకడుగు

● 52 వార్డులు.. సుమారు 1.60 లక్షల ఓటర్లు

● ప్రభుత్వంపై వ్యతిరేకతతో మల్లగుల్లాలు

భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కొరవడటంతో పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. చైర్మన్‌ రిజర్వేషన్‌ అన్‌రిజర్వుడ్‌ కేటగిరీలో ఉంటుందని ముందుగా టీడీపీ, జనసేన నాయకులు అశించారు. దీంతో కొద్దిమంది సీటు కోసం మంతనాలు జరిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ సమయంలో మున్సిపాల్టీ చైర్మన్‌ పదవి అన్‌ రిజర్వుడ్‌ మహిళలకు కేటాయించడంతో కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులు పెద్దగా ముందుకు రాకపోవడంతో పార్టీల పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సంక్షేమ పథకాల అమలుజాడ లేకపోవడంతో ఓట్లు కోసం వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పవని పార్టీల శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేని కొందరు తాము పోటీల్లో ఉంటామని, టికెట్‌ ఇప్పించాలని తెరపైకి రావడంతో రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. పార్టీల కోసం ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని కొత్తవారికి టికెట్లు ఇస్తే పార్టీ శ్రేణులు ఏ మేరకు పనిచేస్తాయోననే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

చైర్‌పర్సన్‌ పదవికి రూ.15 కోట్లు ఖర్చు!

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి టికెట్‌ను ఆశిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందంటూ పార్టీ పెద్దలు చెప్పడంతో వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో మున్సిపల్‌ కౌన్సిలర్స్‌ చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి ఉండటంతో ఈ పదవిని ఆశించే నాయకులు ఆర్థికంగా ఇబ్బంది పడే కొద్ది మంది కౌన్సిలర్‌ అభ్యర్థులకు సాయం చేస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం చైర్మన్‌ పదవి ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నందున ఎక్కువ భారం చైర్మన్‌ అభ్యర్థిపైనే పడుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున వైఎస్సార్‌సీపీకి కలిసి వస్తుందని ఇటువంటి తరుణంలో పెద్ద మొత్తంలో కూటమి అభ్యర్థి ఖర్చు చేయకుంటే గెలుపు సాధ్యం కాదని పార్టీల శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. పట్టణంలో 52 వార్డుల్లో దాదాపు 1.60 లక్షల ఓట్లు ఉన్నందున ఖర్చు భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజాబలం అంతగా లేకపోవడంతో డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని టీడీపీ, జనసేన క్యాడర్‌ ఖరాకండీగా చెబుతున్నట్టు తెలిసింది. దీంతో ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులు వెనుకడుగు వేయడంతో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తొలి విడదతలో భీమవరం మున్సిపల్‌ ఎన్నికలు లేకపోవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement