స్థానికంలోబీసీలకు మొండి చేయి! | - | Sakshi
Sakshi News home page

స్థానికంలోబీసీలకు మొండి చేయి!

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

స్థానికంలోబీసీలకు మొండి చేయి!

కూటమి బీసీల వ్యతిరేకి

ప్రాధాన్యం ఇవ్వడం లేదు

● కుక్కునూరు మండలంలోకనీస ప్రాతినిధ్యం కరువు

● బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి

కుక్కునూరు: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో ఏజెన్సీ ప్రాంతమైన కుక్కునూరు మండలంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కలేదంటూ ఆ వర్గానికి చెందిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాల్లో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోగా, కేవలం ఒక వార్డుకే పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సి ఉండగా, కనీస ప్రాతినిధ్యం కూడా దక్కకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా?

బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆచరణలో తగిన అవకాశాలు కల్పించడం లేదని బీసీ వర్గాలకు చెందిన వారు విమర్శిస్తున్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకు, అమలులో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపై చూపుతున్న ప్రేమ మాటలకే పరిమితమవుతోందని విమర్శిస్తున్నారు.

ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం

స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ ప్రాంత సమస్యలను వినిపించుకునేందుకు బీసీలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటిది కీలకమైన పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేయడం తమ వర్గాన్ని రాజకీయంగా వెనక్కి నెట్టడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన ప్రాధాన్యం కల్పించని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని బీసీ వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో కుక్కునూరు మండలంలో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కూటమి ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టమైంది. కూటమి నాయకులు బీసీలపై చూపుతున్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమని దీనివల్ల తేటతెల్లమైంది.

– మల్లెల చంటి నాయుడు, సంజయ్‌ నగర్‌ కాలనీ, కుక్కునూరు

కూటమి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందే తప్ప, ఎన్నికల్లో వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదు. కుక్కునూరులో బీసీలను కేవలం ఒకే ఒక్క వార్డుకు పరిమితం చేయడం చాలా అన్యాయం.

– కుండా సూర్యనారాయణ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement