జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ
భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన, సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నరసాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు, అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందం, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకుఅనుగుణంగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, శుక్రవారం నుంచి 18 వరకు జరిగే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు పాటించాల్సిన నియమాలను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ పి.ప్రభాకర్, అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు తదితరులు పాల్గొన్నారు.


