పోలవరం రూరల్: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన ఇద్దరు కూలీలను కాలకూట విషవాయువు బలితీసుకున్న ఘోర విపత్తు ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని నూతనగూడెంలో చోటు చేసుకుంది. బావిలో పూడికతీసేందుకు దిగిన ఓ కూలీ ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా, అతనిని కాపాడేందుకు దిగిన మరో సహచర కూలీ కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఘటన వివరాలు ఇలా..
స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోలవరం బీసీ కాలనీకి చెందిన కదల చిట్టబ్బాయి రెడ్డి అలియాస్ చిట్టిబాబు (35), బండి వీర వెంకట్రావు (56), గుడిసె రాజు అనే ముగ్గురు కూలీలు సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో నూతనగూడెం కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న బండి మునేశ్వరరావు ఇంటి ఆవరణలోని బావిలో పూడిక తీసేందుకు పని కుదుర్చుకున్నారు. పని ప్రారంభించిన అనంతరం చిట్టబ్బాయి రెడ్డి (చిట్టిబాబు)(35) మొదటగా బావిలోకి దిగాడు. అయితే బావి లోపల తగినంత ఆక్సిజన్ లేకపోవడం లేదా లోపల పేరుకుపోయిన విషవాయువుల ప్రభావం వల్ల అతనికి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు. దీంతో శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ పైకి రాలేక బావిలోనే ఉండిపోయాడు.
రక్షించబోయి.. రాలేకపోయి..
చిట్టిబాబు ప్రాణాపాయంలో ఉన్నాడని గమనించిన బండి వీర వెంకట్రావు (56) క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాగైనా తన సహచరుడిని కాపాడుకోవాలనే తాపత్రయంతో స్థానికుల సహాయంతో నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగాడు. లోపల స్పృహ తప్పుతున్న చిట్టిబాబును పట్టుకుని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, దురదృష్టవశాత్తు తాడుకు వేసిన ముడి ఊడిపోయింది. దీంతో ఇద్దరూ తిరిగి బావిలో పడిపోయారు. లోపల ఊపిరాడకపోవడం, అలాగే బావిలోని నీటిలో మునిగిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మృతదేహాల వెలికితీత
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలవరం సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే 108 అంబులెన్స్ సిబ్బందికి, కొవ్వూరు అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికుల సహాయంతో శ్రమించి బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు వెలికితీశారు. కళ్లెదుటే ఇద్దరు వ్యక్తులు శవాలుగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. కాగా, మృతుడు కదల చిట్టబ్బాయి రెడ్డి భార్య ముత్యాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు
పోలవరం పంచాయతీ నూతనగూడెంలో విషాదం
శోకసంద్రంలో కూలీల కుటుంబాలు


