వామ్మో పిడుగులు.. తస్మాత్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

వామ్మో పిడుగులు.. తస్మాత్‌ జాగ్రత్త

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు, ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు జరిగి ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అలాగే, మెరుపుల ధాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతుంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిడుగుల నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసిన సమయంలో పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి.

పిడుగు అంటే ఏమిటి?

వాతావరణంలో చోటు చేసుకునే పరిణామాలతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, మెరుపు వేగంతో విద్యుత్‌ కాంతి నేలకు చేరుకుంటుంది. మేఘాల మధ్య విద్యుదావేశం పెరిగి, వాతావరణంలోని తేమ, దుమ్ము కారణంగా స్థిర విద్యుత్‌ భూమివైపు ప్రవహిస్తుంది. ఒక మిల్లీసెకన్‌ కాలంలో మెరుపుతో కూడిన పిడుగు 20 వేల ఆంపియర్ల విద్యుత్‌ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్‌ క్షేత్ర తీవ్రత 2 లక్షల ఓల్టులతో సమానం. ఇది భూమి నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే 7 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మెరుపులు భూమి మీద పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది.

కాపర్‌ ఎర్తింగ్‌తో ప్రమాదానికి చెక్‌

పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో నేరుగా భూమిలోకి శ్రీకాపర్‌ ఎర్తింగ్‌శ్రీ (రాగి వైర్‌ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతడం) ఏర్పాటు చేయడం ద్వారా, దాదాపు కిలోమీటరు దూరంలో పడిన పిడుగును కూడా ఇది ఆకర్షించుకుని నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఉప్పు, బొగ్గు, నీటి మిశ్రమంతో రాగి వైర్‌ కలిగిన రాడ్‌ను భూమిలోకి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ఎత్తైన టవర్లు నిర్మించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పిడుగుపాటు నుంచి రక్షణ పొందవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు

● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండకూడదు.

● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.

● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిపై పడితే గుండైపె తీవ్ర ప్రభావం చూపుతుంది.

● వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమెరాలు, సెల్‌ఫోన్‌లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేదంటే రేడియేషన్‌ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్‌ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్‌, కేబుల్‌ కనెక్షన్లను తొలగించాలి.

● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్‌ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement