రొయ్యకు రెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రొయ్యకు రెస్ట్‌

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

రొయ్యకు రెస్ట్‌ ఇంత దారుణం ఎప్పుడూ లేదు

స్వచ్ఛంద విరామం

సాగుచేసి సిండికేట్‌ను పెంచుతున్నట్టుంది

సాక్షి, భీమవరం: రేయింబవళ్లు చెరువుల్ని కంటికి రెప్పలా కాచుకుని సాగు చేస్తుంటే.. మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి ఫీడ్‌, ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్టర్స్‌ సిండికేట్‌ మా కష్టాన్ని గద్దలా తన్నుకుపోతోంది. దోపిడీని అడ్డుకోవాలన్న మా గోడు చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. నష్టాలతో సాగలేక సాగుకు సెలవు తప్పదంటున్నారు ఆక్వా రైతులు. స్వచ్ఛంద విరామం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల రైతులు చెరువులను ఎండగట్టి పంట విరామం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది.

దోపిడీతో విలవిల

రెండేళ్లుగా ఆక్వా సిండికేట్‌ ఏకపక్షంగా మేత ధరలు పెంచి, రొయ్య రేట్లు తగ్గించి రైతుల కష్టాన్ని కాజేస్తున్నారు. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు వనామీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పట్టుబడులు మొదలై మార్కెట్‌లోకి రొయ్యలు వచ్చే సమయంలో కౌంట్‌ ధరలు తగ్గించేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కిలోకు వంద కౌంట్‌ రూ.265 ఉన్న ధరను రూ.230కు తగ్గించేశారు. మిగిలిన అన్ని కౌంట్ల ధరలు కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు కోత పెట్టారు. రొయ్య ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అంతటా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

రైతుల ఆందోళనలను లెక్కచేయక ఫీడ్‌ ప్లాంట్లు మేత రేట్లను టన్నుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు వరకు పెంచేశాయి. ఎకరాకు రెండున్నర టన్నుల మేత వినియోగిస్తే ధరల పెంపుతో రైతులపై రూ.35 వేలు వరకు అదనపు భారం పడుతోంది. టన్ను వంద కౌంట్‌ రొయ్యల ఉత్పత్తికి రూ.2.6 లక్షలు ఖర్చయితే రైతుకు చేతికందుతోంది. రూ.2.3 లక్షలు లోపే ఉంటోంది. ఈ మేరకు టన్ను రొయ్యల ఉత్పత్తికి రైతులు రూ.30 వేలు నష్టపోతున్నారు. రేయనక పగలనక, ఎండనక వాననక చెరువుల్ని కంటికి రెప్పల కాచుకుంటే చివరికి చేతి చమురు వదులుతోందని వారు వాపోతున్నారు.

మూడు దశాబ్దాలుగా ఆక్వా కల్చర్‌లో ఉన్నాను. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఇష్టానుసారం రొయ్య రేట్లు తగ్గించి మేత ధరలు పెంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరలు నియంత్రణలో ఉండేవి. ఇప్పుడు అడ్డగోలుగా రైతుల కష్టాన్ని దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంఘాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విరామం పాటిస్తున్నాం.

వి.గోపాలకృష్ణరాజు, లంకలకోడేరు

కౌంట్‌ రేట్లు దిగువకి.. మేత ధరలు ౖపైపెకి

సంక్షోభంలో ఆక్వా సాగు

సిండికేట్‌ దోపిడీని అడ్డుకోని చంద్రబాబు సర్కారు

సాగు చేయలేక స్వచ్ఛంద విరామం వైపు అడుగులు

పంట విరామంపై పాలకొల్లులో ఫ్లెక్సీలు ఏర్పాటు

మేత ధరలు తగ్గించాలని తాము రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, రైతు ప్రతినిధుల ముసుగులో టీడీపీకి చెందిన కొందరు ధరల పెంపునకు అంగీకారం తెలపడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. రూపాయి పెంపును సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ముడిసరుకు ధరలు పెరిగాయని మేత ధరలు పెంచినప్పుడు, ముడిసరుకులు ధరలు తగ్గినప్పుడు మేత ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సిండికేట్‌ మొత్తం టీడీపీ చెందిన వారే కావడంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తమ గోడు పట్టించుకోవడం లేదంటున్నారు. నష్టాల సాగు చేయడం కంటే కొంత కాలం విరామం మేలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కొందరు రైతులు చెరువులను ఎండగట్టి పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న చెరువుల్లో పట్టుబడి పూర్తయ్యాక పంట విరామానికి వెళ్లాలని కొందరు, ప్రత్యామ్నాయంగా చేపలు సాగు చేయాలని మరికొందరు భావిస్తున్నారు.

కిలో వంద కౌంట్‌ రొయ్యల ఉత్పత్తికి రూ.260 ఖర్చయితే రైతులకు వస్తుంది రూ.230 మాత్రమే. కిలోకు రూ.30 చొప్పున టన్నుకి రూ.30 వేలు నష్టపోతున్నాం. మేత ధరల పెంచేయ్యడంతో ఈ నష్టం మరింత పెరుగుతుంది. మేం కష్టాలకోర్చి సాగుచేసి సిండికేట్‌ను పెంచుతున్నట్టుంది. అందుకే పంట విరామం పాటించాలని నిర్ణయించుకున్నాను.

సతీష్‌, ఆక్వా రైతు, మేడపాడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement