యోగాతో ఆనందకర జీవనం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆనందకర జీవనం

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

కై కలూరు: ప్రపంచ దేశాలకు భారతదేశం అందించిన అత్యంత అరుదైన కానుక యోగ. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆనందకర జీవనం యోగాతో సిద్ధిస్తాయి. ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 200 దేశాలు ఆదివారం నిర్వహిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, పార్కులలో సామూహిక యోగ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ పొందిన వాలంటీర్లు వేదికల వద్ద ఉమ్మడి యోగా ప్రొటోకాల్‌ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు.

సమాజంలో ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒకరు యోగాసనాలు అలవాటు చేసుకుంటున్నారని తాజా అధ్యాయనాల్లో తేలింది. ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాల భావావేశాలు, ఒత్తిడులు, పనుల తొందర వల్ల టెన్షన్‌ భారిన పడుతున్నాడు. వివిధ రకాల మందుల వల్ల సైడ్‌ ఎఫెక్టులకు గురవుతున్నాడు. నేటి యాంత్రిక యుగంలో ఇది ఒక విషవలయంగా మారింది. ప్రాచీన కాలంలో పతంజిలి, కపిలుడు, చరకుడు, అధునిక యుగంలో రమణమహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానంద, ఇటీవల కాలంలో బాబారామ్‌దేవ్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు రవిశంకర్‌ యోగ అవశ్యకతను చాటిచెబుతున్నారు.

యోగం అంటే..

యోగం అంటే కలయిక, కలుపుట అనే అర్థం. ఇది యుజ్‌ అనే సంస్తృత మూలధాతువు నుంచి ‘యోగా’ అనే పదం ఏర్పడింది. శరీరం, మనసు, ఆత్మలను కలపడం దీని ప్రత్యేకత. యోగంలో అష్టాంగ మార్గలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి వంటి ఎనిమిది మార్గాలు ముఖ్యమైనవి. యోగ దృష్టిలో మానవ శరీరాన్ని 5 కోశాలుగా భావిస్తారు. వీటిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయకోశం ఉన్నాయి. ఇక అందరూ ఖచ్చితంగా పాటించే సూర్య నమస్కారాల్లో ప్రణామాసనము, హస్త ఉత్థానాసనము, పాదహస్తాసనము, అశ్వసంచలనాసనము, పర్వతాసనము, భుజంగాసనము, సాష్టాంగాసనము ఎంతో ప్రాచూర్యం పొందాయి.

మన యోగా చరిత్ర గొప్పది

వయసు పెరిగే కొద్దీ వృద్ధులు శారీరకంగా చురుగ్గా, మానసికంగా ఉల్లాసంగా, స్వతంత్రంగా ఉండేందుకు యోగా ఎలా సహాయపడుతుందో వివరించడమే 2026 యెగా డే ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్‌ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. డిసెంబర్‌ 2014లో తీర్మానాన్ని ఆమోదించారు. 2015 జూన్‌ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్‌ 21 అనేది ఉత్తరార్ధగోళంలో అత్యంత పొడవైన పగటి సమయం ఉన్న రోజు. అందుకే ఈ రోజును యోగా దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, ఐక్యరాజ్యసమితి ఆమోదించింది.

యోగ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది ధ్యాన సాధన. ‘శ్వాస మీద ధ్యాస’ ద్యాన సాధన ద్వారా మనస్సు పూర్తిగా విశ్రాంతి పొంది ఎక్కువగా ప్రాణ శక్తి శరీరానికి అందుతుంది. మనస్సులో ఏర్పడే వ్యతిరేకమైన ఆలోచనలు భయాలు, ఆందోళనలు, ఒత్తిడిల నుంచి తేలికగా బయటపడవచ్చు. ఎన్నో దీర్ఘకాలిక రోగాలు తగ్గి ఆయుష్షు ప్రమాణం పెరుగుతుంది.

–ఉండ్రమట్ల సాంబశివరావు, ధ్యానరత్న, యోగా గురువు, పతంజిలి యోగా ప్రచార పరిషత్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

నేడు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ నినాదం

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

కలెక్టర్‌ ఆదేశాలతో యోగా వేదికలకు ఏర్పాట్లు పూర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement