కై కలూరు/ముదినేపల్లి: పగలు ఉష్ణోగ్రతలు పెరుగుదల, రాత్రి ఈదురుగాలుల బీభత్సంతో జిల్లాలో వింత వాతావరణ పరిస్థితి నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఏలూరు జిల్లాలో అత్యధికంగా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో అత్యధిక వర్షపాతం 58.06 మిల్లీమీటర్లు నమోదైంది. ముదినేపల్లి మండలం 52.2, కై కలూరు మండలంలో 45.2 మీల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈదురు గాలులకు కై కలూరు మండలం వింజరం లాకుల వద్ద వందేళ్ల భారీ వృక్షం పంటకాల్వలో పడిపోయింది. అదే విధంగా ముదినేపల్లి మండలం విశ్వనాధ్రిపాలెం రహదారిలో ఏకంగా మూడు చెట్లు రహదారిపై విరిగి పడ్డాయి. ట్రాఫిక్ స్తంభించింది. ఆక్వారైతులు మారిన వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ నిపుణులు చెబుతున్నారు.
విరిగిన విద్యుత్ స్తంభాలు
బుట్టాయగూడెం: మండలంలో శుక్రవారం రాత్రి రాత్రి 9:30 గంటల సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురు గాలులు వీచి వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విద్యుత్‌లైన్లపై పడి విరిగిపోయాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసమయ్యాయి. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి 2 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.


