సేంద్రియ సారం.. పుడమికి జీవం | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సారం.. పుడమికి జీవం

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాం

రసాయనరహిత పంటలతోనే ఆరోగ్యం

సేంద్రియం వైపు రైతుల అడుగులు

ఆవుపేడ, మూత్రంతో ఎరువుల తయారీ

బుట్టాయగూడెం: వ్యవసాయ రంగంలో సాగు పద్ధతులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం క్రమంగా తగ్గుతోంది. మార్కెట్లో ఎరువుల ధరలు పెరగడం, కొరత వంటి సమస్యలు వెంటాడుతుండటంతో.. పెట్టుబడి తగ్గించుకుని, నేలతల్లిని కాపాడుకోవాలనే లక్ష్యంతో సేంద్రియ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ ఎరువులను వాడటం వల్ల నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతుల దృష్టి ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. కొందరు రైతులు సొంతంగా ఇళ్ల వద్దే ఎరువులను తయారు చేసుకుంటుండగా, మరికొందరు ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఘనామృతం, జీవామృతం, బీజామృతం వంటి ఎరువుల తయారీపై అవగాహన పెంచుకుంటూ రైతులు తమ పొలాల్లో విజయవంతంగా పంటలు పండిస్తున్నారు.

బీజామృతంతో చీడపీడల నివారణ

విత్తన శుద్ధికి బీజామృతాన్ని వాడటం వల్ల నారుమళ్లు చీడపీడల బారిన పడవని అధికారులు చెబుతున్నారు.

కావాల్సిన పదార్థాలు: 20 లీటర్ల నీరు, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవు పేడ, 50 గ్రాముల పొడి సున్నం, గుప్పెడు పొలం గట్టు మట్టి.

తయారీ విధానం: ఒక తొట్టెలో 20 లీటర్ల నీరు పోయాలి. ఆవు పేడను పల్చని గుడ్డలో మూట కట్టి 12 గంటల పాటు ఆ నీటిలో ఉంచాలి. వేరే పాత్రలో ఒక లీటరు నీటిని తీసుకుని 50 గ్రాముల సున్నం కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పేడ మూటను బాగా పిండి, ఆ సారాన్ని నీటిలో కలపాలి. అనంతరం తొట్టెలో పొలం గట్టు మట్టిని వేసి కర్రతో తిప్పాలి. చివరగా 5 లీటర్ల ఆవు మూత్రం, సున్నపు నీటిని కూడా అందులో పోసి బాగా కలిపితే ‘బీజామృతం’ సిద్ధమవుతుంది.

భూసారాన్ని పెంచే ఘనామృతం

ఘనామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతో పాటు నిల్వ చేసుకుని, అవసరాన్ని బట్టి కొద్ది నెలల తర్వాత కూడా వాడుకోవచ్చు. ఖరీఫ్‌ పనులకు సిద్ధమవుతున్న ప్రకృతి వ్యవసాయదారులు ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కావాల్సిన పదార్థాలు: వారం రోజుల పాటు సేకరించిన దేశీ ఆవుపేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, శనగ, ఉలవ, పెసర లేదా మినుము పిండి (ఏదైనా ఒకటి) 2 కేజీలు, బెల్లం 2 కేజీలు (లేదా చెరకు రసం 3 లీటర్లు), తగినంత తాటిపండ్ల గుజ్జు, చిటికెడు పుట్టమట్టి.

తయారీ విధానం: చెట్టు నీడన లేదా షెడ్‌లో ఈ పదార్థాలన్నింటినీ ఆవుపేడలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని 10 రోజుల పాటు ఆరబెడితే ‘ఘనామృతం’తయారవుతుంది.

కోట్లాది సూక్ష్మజీవుల నిలయం..

జీవామృతం

జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై, పంటలకు అవసరమైన అన్ని రకాల పోషకాలను నిరంతరం అందిస్తాయి. భూసారాన్ని రక్షించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. ఆవుపేడ, మూత్రంతో తయారయ్యే జీవామృతంలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ, ఘన రూపాల్లో లభించే ఈ జీవామృతం పంటలకు అద్భుతమైన బలాన్ని ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరిస్తున్నాం. పెట్టుబడి తక్కువ, దిగుబడులు, లాభాలు ఎక్కువగా ఉండటంతో రైతులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. భూసారాన్ని రక్షించేలా, ప్రజలకు ఆరోగ్యకరమైన రసాయన రహిత పంటలు అందించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. సేంద్రియ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాం.

– బి.వెంకటేష్‌, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌, ఏలూరు

ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో స్పష్టమైన అవగాహన వచ్చింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులపై మొగ్గు చూపడం శుభపరిణామం. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలు చేతికి వస్తాయి. రైతులందరూ ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలి.

– జతిన్‌ రాయ్‌,

డీపీఎంయూ కమ్యూనికేషన్‌ అధికారి, ఏలూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement