మామిడి.. తడబడి | - | Sakshi
Sakshi News home page

మామిడి.. తడబడి

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

తోతాపురి టన్ను రూ. 3 వేలే

పట్టించుకోని ప్రభుత్వం

మామిడి రైతుకు మళ్లీ చేదే

పతనమైన ధరలు

పట్టించుకోని ప్రభుత్వం

నూజివీడు: ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి సాగు రైతుకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈసారైనా లాభాలు వస్తాయేమోనని రైతులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏటికేడూ మామిడి పరిస్థితి దిగజారుతుండటంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో తోటలను నరికేసి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపే యోచనలో పలువురు ఉన్నారు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు.

నల్లతామర దెబ్బతో తగ్గిన దిగుబడి

ఏలూరు జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా, అందులో ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఇక్కడ బంగినపల్లి, తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాలు వంటి రకాలను ఎక్కువగా పండిస్తారు. సాధారణంగా మామిడి పంట ఒక ఏడాది కాపు బాగా ఉంటే, మరుసటి ఏడాది తగ్గుతుంది. అయితే గత నాలుగైదేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా ప్రతి ఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో చెట్లు దట్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ దశలో ఆశిస్తున్న శ్రీనల్లతామరశ్రీ తెగులు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది.

దక్కని కోత ఖర్చులు

ఈ ఏడాది కాపు కేవలం 20 నుంచి 30 శాతం లోపే ఉండటంతో సీజన్‌ ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా కనిపించాయి. ముంబై మార్కెట్‌లో బంగినపల్లి రకం టన్ను రూ. లక్ష నుంచి రూ. 60 వేల వరకు పలికింది. కానీ, ఆ తర్వాత ధరలు వేగంగా పడిపోయి సీజన్‌ మధ్యలో టన్ను రూ. 25 వేల నుంచి రూ. 30 వేలకే పరిమితమైంది. దీంతో రవాణా ఖర్చులు పోను రైతులకు, కొనుగోలు చేసిన వ్యాపారులకు పెద్దగా ఏమీ మిగలలేదు. ఇక స్థానిక నూజివీడు, నున్న, విస్సన్నపేట, ఈదర తదితర ప్రాంతాల్లోని కమీషన్‌ దుకాణాల్లో బంగినపల్లి టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 15 వేల లోపే పలికింది. తోతాపురి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ప్రారంభంలో టన్ను రూ. 12 వేలు పలికిన ఈ రకం, ఆ తర్వాత రూ. 3 వేలకు పడిపోయింది. దీనివల్ల రైతులకు కనీసం కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తీవ్ర నష్టాలు మిగలడంతో, ఖరీఫ్‌ సీజన్‌లో తోటల్లో దుక్కి దున్ని ఎరువులు వేసేందుకు కూడా రైతులు వెనుకాడుతున్నారు.

ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే మామిడి చేదు అనుభవాన్ని మిగిల్చింది. బంగినపల్లి, తోతాపురి రకాలకు సరైన ధర లేకపోవడంతో రైతులకు పెట్టుబడులు రాలేదు. కాయలు కొన్న వ్యాపారులూ నష్టపోయారు. తోతాపురి ధర టన్ను రూ. 3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు కూడా దక్కలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలి.

– శీలం రాము, మామిడి రైతు, నూజివీడు

మామిడి ధరలు ఇంతలా పతనమవుతున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్‌కు కనీసం ఇతర రాష్ట్రాల వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు జరిపించే ప్రయత్నం కూడా చేయలేదు. రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కేలా చూసేందుకు ఏ ఒక్క అధికారీ చొరవ తీసుకోకపోవడంతో, ఈ ఏడాది కూడా మామిడి సాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement