తాడేపల్లిగూడెం: శాసీ్త్రయ పద్ధతులతో చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధుల నివారణకు కృషి చేయవచ్చని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంటు బోర్డు సహకారంతో చేపలు, రొయ్యల వ్యాధులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం వెంకట్రామన్నగూడెం కెవికెలో ప్రారంభమైంది. చేపలు, రొయ్యల వ్యాధుల నిర్ధారణ పరికరాలు, నిర్వహణ పద్ధతులు అనే అంశంపై శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ దేశంలో మత్స్య, ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చేపల రొయ్యల సాగులో వ్యాధులు పెరగడం వల్ల భారీ నష్టాలు రైతులకు వస్తున్నాయన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి , శాసీ్త్రయ పద్ధతుల ద్వారా నివారించాలన్నారు. దీని వల్ల స్థిరమైన ఉత్పత్తి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు. వర్సిటీ విస్తరణ సంచాలకుడు సీహెచ్ రూత్ మాట్లాడుతూ రైతులు, మత్స్య కారులకు శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని చేరవేయడంలో కేవీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఆక్వా కల్చర్ రంగంలో ఎదురవుతున్న వ్యాధి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం శిక్షణ ద్వారా లభిస్తుందన్నారు. గేదెల పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ కె.ఆనందరావు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో మత్స్య పరిశ్రమ ప్రాధాన్యత, రొయ్యల్లో వైట్ సిండ్రోమ్ ,చేపలో బ్యాక్టీరియా వ్యాధుల గురించి వివరించారు. కోర్సు డైరెక్టర్ సీహెచ్.కిరణ్‌కుమార్, కో డైరెక్టర్ డాక్టర్ ఎ.దేవీవరప్రసాదరెడ్డి, కో ఆర్డినేటర్లు ఇ.రేఖ, కె.అర్చన తదితరులు పాల్గొన్నారు.


