చాట్రాయి: మండలంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. మట్టి తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. చనుబండ గ్రామంలోని చిన్న చెరువు, పెద్ద చెరువుల నుండి ఇప్పటికే వేలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించారు. సాగునీటి చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టిని తోడేయడంతో ఆ ప్రాంతాలన్నీ లోతైన లోయలను తలపిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ ఎవరైనా ఈ గోతుల్లో పడితే ప్రాణాలు దక్కే పరిస్థితి లేదు. కనీసం పశువులు దిగినా బయటకు రాలేనంత లోతుగా తవ్వకాలు జరిపారు. సాధారణంగా అనుమతులు ఉన్నవారైనా నిబంధనల మేరకే నిర్ణీత లోతులో మట్టిని సేకరించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి అక్రమార్కులు ఎలాంటి నిబంధనలనూ లెక్కచేయకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ చెరువుల నుంచి తరలిస్తున్న ఈ మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూముల చదునుకు విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా మట్టి రవాణా సాగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.


