వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ముదునూరి ప్రసాదరాజు
నరసాపురం : వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ అక్రమ అరెస్ట్ దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా మద్యం కేసులో సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేశారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమకేసులతో రాజ్యాంగ విలువను కాలరాసేలా అధికార పార్టీ వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించాలన్నారు. సూపర్‌సిక్స్ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలకు పరాభవం తప్పదన్నారు. విజయవాడలో యువకుడి లాకప్‌డెత్, తునిలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం లాంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో తెలియజేస్తున్నాయన్నారు.
ఏలూరు టౌన్: టీడీపీ ప్రభుత్వం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసిందని.. కారుమూరి సునీల్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయటం అన్యాయమని.. బీసీ సామాజికవర్గం పక్షాన అరెస్టును ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను అరెస్ట్‌లు చేయటం, వేధింపులకు గురిచేయటమే లక్ష్యంగా లేని మద్యం స్కామ్‌ను సృష్టించారని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బార్లకు మేలు చేస్తూ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొడితే ఈడీకి ఇవన్నీ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేసి అవినీతికి పాల్పడినా ఈడీ కళ్ళు మూసుకుందా అంటూ ధ్వజమెత్తారు. మా పార్టీ బీసీ యువ నాయకుడు కారుమూరి సునీల్‌కుమార్‌పై ఈడీ అన్యాయంగా కేసుపెట్టి అరెస్ట్ చేయటం రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగమే అన్నారు.


