ఉండి: ‘నమ్మి కట్టుకున్న పసుపుతాడు ఈరోజు ఆక్వారైతులకు ఉరితాడుగా మారింది’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆక్వారైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలకు చెందిన ఆక్వారైతులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు చేయి చేయి కలిపి తరలివచ్చారు. ముందుగా ఆక్వారైతులు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లు, జెండాలు పట్టుకుని ఉండి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ మెడకు పసుపురంగు ఉరితాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆక్వారైతులకు లభించిన బహుమానం ఇదేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించి, కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేతల ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని గత కొద్ది నెలలుగా ఆక్వారైతులు నిరసనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అంతర్జాతీయంగా డాలర్ ధర పెరుగుతుంటే ఇక్కడ రొయ్యల ధరలు తగ్గిస్తున్నారని, మేతల ధరలను టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోని పక్షంలో తామంతా ఒకటి రెండు రోజుల్లో ‘ఛలో అమరావతి’ లేదా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆక్వారైతులు
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి తరుఫున మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు ఆక్వారైతుల చలవ వల్లే గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తామంతా ఎంతో కష్టపడి వారిని గెలిపించుకున్నా మని రైతులు అన్నారు. కానీ ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వ వైఖరి మరొకటిగా మారిపోవడం దారుణమన్నారు. తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరిలో 15 మంది ఎమ్మెల్యేల విజయానికి ఆక్వారైతుల అండదండలే కారణమని, ఇప్పుడు తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వారైతులంతా చేయి చేయి కలిపి ‘ఆక్వా (ష్రింప్) జనతా పార్టీ’ పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. తగిన న్యాయం జరగకపోతే ఆక్వా సాగుకు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆక్వారైతులను నట్టేట ముంచుతుండటంతోనే అన్ని పార్టీల్లోని ముఖ్య నాయకులంతా రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపినట్లు వివరించారు.
మెడకు ఉరితాళ్లు తగిలించుకుని ఉండి సెంటర్‌లో రైతుల నిరసన
న్యాయం చేయకపోతే కూటమి ప్రభుత్వానికి షాక్ తప్పదని హెచ్చరిక
మద్దతు తెలిపిన వివిధ పార్టీల నేతలు


