‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సూపర్‌హిట్‌ | - | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సూపర్‌హిట్‌

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

జగన్‌ ఇచ్చిన పథకాలు రద్దుచేశారు

సూపర్‌ సిక్స్‌ నెరవేర్చలేదు

విలేకరుల సమావేశంలో

కారుమూరి మండిపాటు

తణుకు అర్బన్‌: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయ్యిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. తణుకు పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు నేస్తం, చేదోడు, వాహనమిత్ర వంటటి పథకాలతోపాటు 17 మెడికల్‌ కళాశాలలను ఏంచేశారని ప్రశ్నించారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దామని చంద్రబాబు పాలనలో పాఠశాలలు నేడు అధోగతి పాలయ్యాయని, విద్యాసంవత్సరం ప్రారంభించినా ఇంతవరకు పుస్తకాలు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని నిలదీశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్‌ ఇచ్చిన పథకాలను రద్దుచేయడమే కాకుండా ఇస్తానన్న సూపర్‌సిక్స్‌ పథకాలు ఇవ్వకపోవడంతోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను ఇచ్చారా అని మండిపడ్డారు.

తణుకు నియోజకవర్గంలో మద్యం, పశువధ, పేకాట వంటి అంశాలను ఆదాయ వనరుగా మార్చుకుని రాబందులా రాధాకృష్ణ పీక్కుతింటున్నారని కారుమూరి ఆరోపించారు. వైజాగ్‌లో దొరికిన ఆవు మాంసం మూలాలు తణుకు మండలం తేతలి కర్మాగారానికి చెందినవని తేలినప్పటికీ నిరోధించకపోగా సదరు పశువధ కర్మాగారానికి పన్ను మినహాయింపులు ఇవ్వడం వెనుక ఎమ్మెల్యేకు ఉన్న పావలా వాటా నిదర్శనమన్నారు. మా ప్రభుత్వ హయాంలో తణుకులో రూ. 800 కోట్లు టీడీఆర్‌లో కారుమూరి స్కాం చేశారని ప్రచారం చేశారని, నేడు వారి ప్రభుత్వ హయాంలో గతంలో ఎలాంటి తప్పు జరగలేదని అధికారులే నివేదికలు ఇచ్చారని వివరించారు. నేడు తణుకులో టీడీఆర్‌లకు తెరతీశారని, పూర్తయిన రోడ్లకు కూడా టీడీఆర్‌లు పెడుతున్నారని, లేఅవుట్‌లలో సైతం డబుల్‌ రోడ్లు వేసేసి బిల్డర్ల నుంచి భారీగా దోచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సొంత గ్రామం వేల్పూరులో ప్రజలకు సెంటు భూమి కొనలేకపోగా టాయిలెట్స్‌ పడగొట్టి వారి ఇంట్లో పనివార్లకు ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వేల్పూరులో హాస్పిటల్‌ నిరా్మాణానికి నిధులు తెస్తే కోర్టుకు వెళ్లారని, వివిధ వర్గాలకు కమ్యూనిటీ హాల్సు నిర్మాణాలు చేయిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. మద్యంపై రోజుకు రూ.20 ఎమ్మెల్యేకి ఇస్తున్నానని బాహాటంగానే చెబుతుండడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్‌సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపి, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్‌ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఇరగరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్‌, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్‌, సప్పా బలరామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement