ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సౌరభ్ గౌర్ మా ట్లాడుతూ... రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. సకాలంలో రక్తం అందడం వల్లే ఎందరో ప్రాణాలు రక్షించబడుతున్నాయని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సురక్షిత రక్తసరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో రెడ్‌క్రాస్ సొసైటీ పాత్ర అభినందనీయమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానంపై కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా రెడ్‌క్రాస్ సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అ ధ్యక్షత వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ రక్త కేంద్రాలు, అత్యధికంగా శిబిరాలు నిర్వహించిన సంస్థలు, విశిష్ట సేవలు అందించిన దాతలు, విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


