విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

దాళ్వా సాగులో బిజీగా రైతులు

గణపవరం: సార్వా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దాళ్వా సాగు కలిసిరావడంతో ఆనందంగా సార్వా సాగుకు రెడీ అవుతున్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో పంట కాల్వలకు దగ్గరగా ఉన్న భూములలో ఇప్పటికే నారుమడులు వేయగా, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లోని మెట్ట ప్రాంతంలో బోర్ల కింద సాగయ్యే భూములలో నారుమడులు పూర్తి చేశారు. మిగిలిన భూములలో ఇప్పుడిప్పుడే నారుమడుల తయారీ, విత్తనాలు చల్లుకోవడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

విత్తన నాణ్యతే కీలకం

వరి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాగులో నారుమడి దశ చాలా కీలకం. ఈ సమయంలో సరైన విత్తనాలను ఎంపిక చేసుకుంటే చక్కని ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. పండించే పంటను బట్టి సమీప వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ఆ అవకాశం లేకుంటే డివిజన్‌, మండల కేంద్రాల్లోని స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాల కొనుగోలుపై వారి సలహాలు తీసుకోవాలి.

రైతులే స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటే వాటి మొలక శాతాన్ని పరీక్షించాలి. పంటల సాగులో సరైన విత్తనాలను వినియోగించకపోతే మొలకల శాతం తగ్గి, దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఒక్కోసారి తెగుళ్లు, చీడపీడలు ఎక్కువగా ఆశించి రైతులు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ నిపుణులు సూచించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి.

విత్తన రకాలు

బ్రీడర్‌ సీడ్‌ : పంటలో అన్ని రకాల విత్తనాలకు మూలంగా బ్రీడర్‌ సీడ్‌ను పరిగణిస్తారు. వరి విత్తనోత్పత్తి పరిశోధనా కేంద్రాలలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో వీటిని ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనాలలో జన్యు స్వచ్ఛత 100 శాతం ఉంటుంది. ఈ విత్తనాల ప్యాకెట్లకు పసుపు రంగు ట్యాగులు ఉంటాయి.

సీడ్‌ : బ్రీడర్‌ సీడ్‌ నుంచి ఫౌండేషన్‌ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విత్తనాలు కూడా 100 శాతం జన్యు స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ విత్తనాల సంచులకు తెలుపు రంగు ట్యాగులు ఉంటాయి.

çÜÇ-t-OòœyŠæ-ಸರ-್-ಟ-ಿ-ಫೈ-ಡ್ ïÜyŠæ: వ్యవసాయ శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ఫౌండేషన్‌ విత్తనాల నుంచి రైతులే సొంతంగా తమ పొలాలలో ఈ విత్తనాలను తయారు చేసుకుంటారు. వీటిని వ్యవసాయ శాఖ ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాత, నిర్దేశించిన ప్రమాణాలు కలిగి ఉంటే వ్యవసాయ శాఖ సీడ్‌ సర్టిఫికేషన్‌ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తుంది. ఈ విత్తనాల సంచులకు నీలి రంగు ట్యాగులు వేస్తారు.

రైతుల విత్తనాలు: ఇవేమీ లేకుండా ఎక్కువగా రైతులే తాము స్వయంగా పండించిన విత్తనాలను ఇతర రైతులకు మార్కెట్‌లో విత్తనాల ధర కన్నా తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. అధిక శాతం రైతులు వీటిపైనే ఆధారపడుతుంటారు. ఈ విత్తనాల నాణ్యతపై అధికారిక భరోసా అంటూ ఏమీ ఉండదు. కానీ, ఈ రైతుల స్థాయిలో పండించిన విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన సందర్భాలు అతి తక్కువనే చెప్పవచ్చు.

మొలక శాతం పరీక్ష కీలకం: రైతులు విత్తనాలను విత్తుకునే ముందు విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి తప్పనిసరిగా విత్తనాల మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. వినియోగించే విత్తనాలలో కొన్నింటిని గ్లాసులో వేసి నీరు పోసి, 24 గంటల తర్వాత గుడ్డలో మూటకట్టాలి. వీటిలో 80 శాతం మొలకలు వస్తేనే ఆ విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి.

శుద్ధి తప్పనిసరి: మొలక శాతం సంతృప్తికరంగా ఉంటే విత్తనాలను చల్లుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని కోసం ఒక కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండిజం కలిపి రెండు రోజులు ఒక సంచిలో నిల్వ ఉంచాలి. అనంతరం ఆ విత్తనాలను వదులుగా ఉండేలా ఒక సంచిలో వేసి, ఒక రోజు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి మరో రోజు గాలి తగలని (వెచ్చని) ప్రదేశంలో ఉంచాలి.

యాజమాన్యం: ముందుగా సిద్దం చేసుకున్న నారుమడిలో ఒక సెంటు నారుమడిలో 5 కిలోల చొప్పున శుద్దిచేసిన విత్తనాలను సమానంగా చల్లుకోవాలి. నారుమడిలో నత్రజని వేసిన 12 నుంచి 16 రోజుల మధ్య పొటాషియం, భాస్వరం ఎరువులు చల్లుకోవాలి. నారుమడి వేసిన 25 రోజుల తర్వాత పొలంలో నాటుకోవాలి.

మొలకలు రాకుంటే నష్టపరిహారం: నారుమడి వేసిన పదిరోజుల వ్యవధిలో విత్తనాలనుంచి మొలకలు రాకపోతే సత్వరమే వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయాలి. డివిజన్‌ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల ద్వారా జిల్లా విత్తన కమిటీకి ఫిర్యాదు అందేలా చూడాలి. ఒకవేళ విత్తనాలలో లోపాలు ఉండి నారుమడి దెబ్బతింటే సంబంధిత అధీకృత డీలరు, కంపెనీ నుంచి నష్టపరిహారం పొందే వీలు ఉంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లులు, విత్తనాల సంచి, ట్యాగ్‌ తదితర ఆధారాలను రైతులు తమవద్ద ఉంచుకోవాలి

విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గణపవరం ఏవో ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ వివరించారు.

● రైతులు ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల బరువును నిర్ధారించుకోవాలి.

● విత్తనాలు కొన్న డీలర్‌వద్ద రసీదు తీసుకోవాలి. పంట నష్టం జరిగితే బిల్లు సమర్పించి పరిహారం పొందే అవకాశం ఉంటుంది.

● విత్తనాలను ఇంటికి తీసుకెళ్లాక మొలక శాతాన్ని పరీక్షించి, సంతృప్తిగా ఉంటేనే విత్తనాలు చల్లుకోవాలి.

● విత్తనాల రసీదును పంటకాలం పూర్తయ్యే వరకూ భద్రపర్చుకోవాలి.

● సీల్‌ తీసిన సంచులు, మూతలు తీసిన డబ్బాలు, పగిలిన ప్యాకెట్లలో విత్తనాలు తీసుకోవద్దు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement