యలమంచిలి: ప్రభుత్వానికి, అప్సడాకు కనీస స మాచారం ఇవ్వకుండా రొయ్య మేత కంపెనీలు ఆక్వా ఫీడ్ ధరలను పెంచడాన్ని ఆక్వా రైతు సంఘం రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. పా లకొల్లులో శనివారం ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. గాంధీ భగవాన్‌రాజు మాట్లాడుతూ మేత కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం అన్యాయమన్నారు. అప్సడా యాక్ట్‌కు విరుద్ధంగా ధరలు పెంచడాన్ని సహించబోమన్నారు. ధరల పెంపు విషయంలో నాలుగు రోజుల క్రితం ఆక్వా రైతులకు, రొయ్య మేతల కంపెనీ ప్రతినిధులకు కమిషనర్ జూమ్ కాల్ ఏర్పాటు చేశారన్నారు. కంపెనీ ప్రతినిధులు ధరలు పెంచుతామంటే తాము ఒప్పుకోలేదన్నా రు. ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ధరల పెంపు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మేత కంపెనీలు మెడిసన్ రేటు 30 శాతం, మేత కిలోకు రూ.12 పెంచాయని ఆ మేరకు రొయ్య ధరలు మాత్రం పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల సమయం ఇస్తున్నామని, అప్పటికీ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మంగళవారం నిరసనలు చేపడతామని చెప్పారు. అవసరమైతే చలో అమరావతి పిలుపునిచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు.


