● యథేచ్ఛగా విద్యా సామగ్రి విక్రయాలు
● పుస్తకాలు, యూనిఫాం అమ్మకాలు
● నామమాత్రపు దాడులతో సరి
భీమవరం: జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. పెద్ద మొత్తంతో ఫీజుల వసూళ్లతో పాటు విద్యా సామగ్రి విక్రయాలు సాగుతున్నా అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 1,300 ప్రభుత్వ, 563 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల బాటపడుతున్నారు. ఇదే అదునుగా పుస్తకాలు, యూనిఫాం, విద్యా సామగ్రిని అధిక ధరలకు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. విద్యా సామగ్రి తప్పనిసరిగా తమ వద్దే కొనుగోలు చేయాలని కొన్ని సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి.
ఉల్లంఘనలపై అరకొర దాడులు
నిబంధనలకు విరుద్ధంగా విద్యా సామగ్రి విక్రయాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు అరకొర దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు సమాచారం ఇచ్చిన కొన్ని సందర్భంగా మొక్కుబడి గా ఆయా స్కూళ్లలో దాడులు చేసి విద్యాసామగ్రి ఉ న్న గదులను సీజ్ చేస్తున్నారు. అయితే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపో వడంతో వీరి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. సీజ్ చేసిన విద్యా సామగ్రిని కొన్నిరోజుల తర్వాత ఆయా విద్యాసంస్థలకు అప్పగించడంతో దర్జాగా తిరిగి అమ్మకాలు చేస్తున్నారు.


