వదిన, అత్తలపై కక్షతోనే.. | - | Sakshi
Sakshi News home page

వదిన, అత్తలపై కక్షతోనే..

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

ఏలూరు టౌన్‌: ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారు జీడిమామిడి తోటలో జరిగిన జంట హత్యల కేసును ఏలూరు జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, సీడీఆర్‌ రికార్డుల ఆధారంగా ఛేదించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కక్షతో పాటు, తీసుకున్న అప్పును ఎగ్గొట్టాలనే దురాశతో ప్రధాన నిందితురాలు ఈ దారుణానికి ప్రణాళిక రచించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఈ వివరాలను వెల్లడించారు. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మద్దా వెంకటలక్ష్మి, గంటా ఆంథోబాయి తల్లీ కూతుళ్లు. మే 29న నల్లమాడు సమీపంలోని తోటలో విగతజీవులుగా పడి ఉన్నారు. చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన వెంటనే, ఎస్పీ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.

నిందితుల అరెస్టు

పోలీసులు ఈ నెల 5న తాడేపల్లిగూడెం రోడ్డులో పోనమాల శిరీష, కర్రి ప్రసాద్‌ (బన్ను), ఆశు దుర్గ అనే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మృతురాళ్ల బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాళ్లు, మద్యం సీసాలు, గుళికలు కలిపిన టీ చిక్కం, మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితురాలు శిరీషకు మృతురాలు వెంకటలక్ష్మి వదిన, ఆంథోబాయి అత్త అవుతారు. తన అక్రమ సంబంధాల గురించి శిరీష భర్తకు వీరు చెప్పారన్న కోపంతో పాటు, ఆంథోబాయి దగ్గర తీసుకున్న రూ. లక్ష అప్పు తీర్చాల్సిన పనిలేకుండా చేయాలనే కుట్రతో ఈ హత్యలకు పథకం వేశారు. మే 29న శిరీష మృతురాళ్లను మభ్యపెట్టి తోటలోకి పిలిపించింది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం, నిందితురాలు ఆశు దుర్గ మద్యం సీసాలలో నిద్రమాత్రలు కలిపి వారికి తాగించింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, కర్రి ప్రసాద్‌ సహకారంతో బ్లేడుతో దాడి చేసి, రాళ్లతో తలలను పగలగొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసి పరారయ్యారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నిడమర్రు, భీమడోలు, కై కలూరు రూరల్‌, ఏలూరు టూటౌన్‌, పెదవేగి సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ మరియు ప్రత్యేక బృందాల సిబ్బందిని ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

జంట హత్యల కేసును ఛేదించిన ఏలూరు పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement