కలెక్టర్ అడ్వెంచర్ రైడ్
కాళ్ల : జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి సాహసోపేత రైడ్ చేసి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. కాళ్ల మండలం పెద అమిరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారా మోటర్ ఎరైవల్ అడ్వెంచర్ స్కై రైడ్‌ను ఏర్పాటు చేయగా, తొలి రైడ్‌ను కలెక్టర్ చేసి యువతను ఉత్సాహపరిచారు. భీమవరం అంటే కోడి పందేలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్‌ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందని కలెక్టర్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజుల్లో స్థానిక యువతకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రైడ్స్ నిర్వహిస్తారని అన్నారు. ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని, రైతుల పండుగని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రతి ఇంటి ముందు భోగి మంటలు, రంగవల్లులతో పండుగ శోభ ఉట్టిపడుతుందన్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
భీమవరం: రైతులకు విరివిగా పంట రుణాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన ఖరీఫ్, రబీలో పండించే వివిధ రకాల పంటలకు ఆర్థిక సహాయ పరిమితిని నిర్ణయించడానికి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సుమారు 85 శాతం కౌలు రైతులున్నారని వారిని కోఆపరేటివ్ సొసైటీల్లో సభ్యులుగా నమోదు చేయించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు ఫిబ్రవరి 15 లోపుగా పంట రుణాలందించాలన్నారు. అర్హులైనవారిలో మొదటి విడతగా 20 వేల మందికి రూ.1.50 లక్షల రుణాలు అందించనున్నట్లు చెప్పారు.
భీమవరం: సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. పండుగ ముసుగులో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించడం, చట్టరీత్యా పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పందేల నిర్వహణకు స్థలాలను అద్దెకు ఇచ్చే రైతులు, కోళ్లకు కత్తులు కట్టేవారు, కత్తులను తయారు చేసేవారిపై కూడా చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంటే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో జనగణన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అమరావతి నుంచి ఇన్‌చార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం జనగణన కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన చర్యలపై కలెక్టర్ వివరించారు. ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారని, అదనపు జనాభా లెక్కల అధికారిగా జేసీని నియమించామన్నారు. సమర్ధంగా జనగణన నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.


