చంద్రబాబు పాలనలో అరాచకాలు, అక్రమాలు
● పేకాట క్లబ్‌లు, గో వధ, ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమ వసూళ్లు
● మాజీ మంత్రి కారుమూరి మండిపాటు
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసం, దౌర్జన్యాలు, దాడులు, దోపిడీ వ్యవస్థ తాండవిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, దోపిడీకి సంబంధించి ఏపీలో తణుకు టాప్–5లో నిలిచిందని స్పష్టం చేశారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తణుకులో ప్రజాస్వామ్యానికి బదులుగా రాచరిక పాలన నడుస్తోందని, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సామంతరాజులా వ్యవహరిస్తున్నారని, ఆయన చెప్పించే శాసనం అన్నట్టుగా పాలన నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అనవసర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో తనను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం దుర్మార్గమన్నారు. ఊరూపేరూ లేని వివాదాస్పద ఫ్లెక్సీలు మీ ఇంటి నుంచి ఉరదాళ్లపాలేనికి పంపించే ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గో వధ చేస్తున్నారని, పేకాట క్లబ్‌లు నడుపుతున్నారని, క్రికెట్ బుకీలతో మీటింగ్‌లు పెట్టించి లాభపడు తున్నారని విమర్శించారు. తమ కార్యకర్తలతో కూడా ఫ్లెక్సీలు పెట్టించగలమని చెప్పారు. తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేసి పార్కు నిర్మాణం చేసిన చరిత్ర తనదైతే, వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీ కట్టించిన చరిత్ర ఎమ్మెల్యే రాధాకృష్ణదని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా ఎంతో హుందాతో రాజకీయం చేశారని గుర్తుచేశారు.
ఆర్‌కే ట్యాక్స్‌తో దోపిడీ
ఆర్‌కే ట్యాక్స్ పేరుతో ఇష్టానుసారంగా దోచేస్తున్నారని కారుమూరి విమర్శించారు. మద్యం దుకాణాల్లో పావలా వాటాలు తీసుకుని పావలా ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది, నేడు దుకాణానికి రూ.5 లక్షలు చొప్పున వసూళ్లకు దిగారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వసూళ్లపై ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. ఆర్‌కే ట్యాక్స్ చిట్టా సిద్ధంగా ఉందని, మీ అవినీతి పాలనపై సంక్రాంతి పండుగ తరువాత అణుబాంబులను వేసేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో తమ హయాంలో చేసిన అభివృద్ధి కంటికి కనిపించడం లేదా అని కారుమూరి ప్రశ్నించారు. గ్రామంలో నిర్మించిన శివాలయం, సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు ఇంటింటికీ కుళాయి, 3.20 ఎకరాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు వంటివి కనిపించకపోవడం బాధాకరమన్నారు. వేల్పూరులో అన్ని వర్గాలకూ చెందిన కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే బిల్లులు రాకుండా చేయాలని కోర్టు ద్వారా అడ్డుకున్నారని విమర్శించారు.


