
ఆలయాల్లో ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు కసరత్తు
ద్వారకాతిరుమల: దేవాలయాల్లో కొత్త ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు ట్రస్టు బోర్డుల్లో సభ్యులుగా స్థానం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకున్నారు. దీంతో వారు 25 మంది పేర్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ కొందరు ఆశావహులు ఇంకా పైరవీలు సాగిస్తూనే ఉన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌తో పాటు మరో 17 మంది సభ్యులతో ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందులో 13 పదవులు టీడీపీకి ఇచ్చి, బీజేపీ, జనసేనలకు చెరో రెండు పదవులు ఇచ్చి సరిపెట్టేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో వంశపారంపర్య ధర్మకర్తలున్న ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటులో మినహాయింపు ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు ట్రస్టు బోర్డులు లేనట్టే. ఇక్కడ పదవులు ఆశిస్తున్న నేతలకు చుక్కెదురైనట్టే. ప్రభుత్వం దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ట్రస్టు బోర్డులున్నా.. సభ్యులు డమ్మీలే
వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్న ఆలయాలకు ట్రస్టు బోర్డు సభ్యులు కేవలం డమ్మీలుగా మాత్రమే వ్యవహరిస్తారన్నది జగమెరిగిన సత్యం. బోర్డు సభ్యులంతా కలసి ధర్మకర్తను మార్చడానికి వీలుపడదు. కేవలం వారు ట్రస్టు బోర్డు సభ్యులమని చెప్పుకోవడానికి, ఆ పేరుతో ఉచితంగా తమకు, తమ వారికి దర్శనాలు చేయించుకోవడానికి, ప్రసాదాలు అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడతారు. ఇది దేవస్థానానికీ అదనపు భారమే. ప్రభుత్వం ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకుని వంశపారంపర్య ధర్మకర్తలున్న ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటులో మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చేనెల మొదటి వారంలోగా కొలిక్కివచ్చే అవకాశం
సభ్యులుగా స్థానం కోసం ఆశావహుల పైరవీలు