
బడికి మూత
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: విద్యావ్యవస్థలో కూటమి ఎంపీఎస్ (మోడల్ ప్రైమరీ స్కూల్) విధానం ప్రభుత్వ పాఠశాలలకు ముప్పుగా తయారైంది. ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే ప్రమాదం పొంచి ఉంది. గత విద్యాసంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 1,400 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1, 2 తరగతులు కలిగిన ఫౌండేషన్ స్కూళ్లు (ఎఫ్‌ఎస్) 96 ఉండగా, 1 నుంచి 5 వరకు ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్లు (ఎఫ్‌పీఎస్) 1025, 1 నుంచి 7/8వ తరగతి వరకు ప్రైమరీ హైస్కూళ్లు (పీహెచ్‌ఎస్) 43, 3 నుంచి 10 వరకు హైస్కూళ్లు(హెచ్‌ఎస్) 43, 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్‌ఎస్)144, జూనియర్ ఇంటర్ కలిగిన హైస్కూళ్లు (హెచ్‌ఎస్ ఫ్లస్) 20 ఉన్నాయి.
తగ్గిన విద్యార్థుల సంఖ్య
ఎంపీఎస్ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత విద్యాసంవత్సరంలో 1,04,654 మంది ఉండగా, ఈ విద్యాసంవత్సరంలో 87,861 మంది ఉన్నారు. ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయని వీరి సంఖ్య పెరగవచ్చునని విద్యాశాఖ వర్గాలంటున్నాయి. పాఠశాలల విలీనం నేపథ్యంలో భవిష్యత్తులో తక్కువ విద్యార్థులు ఉన్న వాటిని ప్రభుత్వం ఎత్తివేస్తుందన్న అనుమానంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.
నాడు.. నాడు–నేడుతో మహార్దశ
పేదల విద్యకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. ప్రపంచంతో పేదల పిల్లలు పోటీపడేలా ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మనబడి నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరిలూదారు. రూ. 369.11 కోట్ల వ్యయంతో డిజిటల్ క్లాస్‌రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మేజర్, మైనర్ మరమ్మత్తులు తదితర అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్‌రీల్
ఎంపీఎస్‌తో పొంచి ఉన్న ముప్పు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపీఎస్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో 60 మంది విద్యార్థులు ఉండాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట సమీప ఎఫ్‌పీఎస్ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను వీటిలో విలీనం చేశారు. మిగిలిన 1, 2 తరగతులతో ఎఫ్‌పీఎస్ పాఠశాలలు కాస్తా ఫౌండేషన్ స్కూళ్లుగా మారిపోయాయి. ఈ మేరకు ప్రస్తుతం జిల్లాలో 186 ఫౌండేషన్ స్కూళ్లు ఉండగా బేసిక్ ప్రైమరీ 730, మోడల్ ప్రైమరీ స్కూళ్లు 244, యూపీ 35, హైస్కూళ్లు 197 ఉన్నాయి. ఫౌండేషన్ స్కూళ్లు ఏకోపాధ్యాయ, బేసిక్ ప్రైమరీలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటున్నారు. గతంలో 96 మాత్రమే ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం 186కు పెరిగాయి. వ్యక్తిగత, అత్యవసర పనిపై వీటిలోని ఉపాధ్యాయులు సెలవు పెట్టాల్సి వస్తే కొన్నిచోట్ల డిప్యుటేషన్ మరొకరిని నియమిస్తున్నారు. అందుబాటులో లేని చోట ఆ రోజుకు ఆ ఫౌండేషన్ స్కూల్‌ను మూసివేసి అక్కడి విద్యార్థులను సమీప పాఠశాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
సర్కారు స్కూళ్లకు ‘మోడల్’ కష్టాలు
జిల్లాలో ఫౌండేషన్ పాఠశాలలు 186
ఒక్కో పాఠశాలలో ఒకరి నుంచి ఐదుగురు మాత్రమే విద్యార్థులు
ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆరోజు పాఠశాల మూతే
కూటమి విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య
పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలోని ఈ ఎంపీపీ స్కూల్‌కు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యావేత్తలు, ఉద్యోగులు, ప్రముఖులు ఓనమాలు దిద్దింది ఇక్కడే. తాజాగా కూటమి ప్రభుత్వం తెచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఎంపీఎస్) విధానంలో ఇక్కడి 3, 4, 5 తరగతులను ఇందిరమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో విలీనం చేశారు. ఈ పాఠశాలను 1–2 తరగతులతో ఫౌండేషన్ స్కూల్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సోమవారం స్కూల్ ఉపాధ్యాయుడు సెలవు పెట్టడంతో ఇక్కడి విద్యార్థులను ఇందిరమ్మ కాలనీలోని స్కూల్‌కు తరలించారు. దీంతో ఇదిగో.. ఎంతో చరిత్ర ఉన్న ఈ పాఠశాలలోని కుర్చీలు ఇలా ఖాళీగా కనిపించాయి.
ప్రభుత్వ తీరు సరికాదు
కూటమి ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ విద్యారంగానికి కొమ్ము కాసేలా ఉన్నాయి. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
– బొంతు ఆనందరాజు, రిటైర్డ్ హెచ్‌ఎం, లక్ష్మణేశ్వరం

బడికి మూత

బడికి మూత

బడికి మూత