
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆలయ కమిటీ వారు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు.
పెద్దింట్లమ్మకు ప్రత్యేక పూజలు
కై కలూరు: కొల్లేటి పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు మా కుటుంబాలకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, కేశఖండన, గదుల అద్దెలు, లడ్డూ ప్రసాద విక్రయాలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయాలతో కలిపి మొత్తంరూ. 62,073 ఆదాయం వచ్చిందని తెలిపారు.
నేడు మిగులు భూముల సమస్యపై పోరు
ఏలూరు (టూటౌన్): ఎర క్రాలువ మిగుల భూముల సమస్యపై టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల పరిధిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో సోమవారం జరిగే పర్యటన జయప్రదం చేయాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మిగులు భూములను ఇంకా ఇప్పటికీ అక్రమంగా భూస్వాములే అనుభవిస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాంతాల్లో పామాయిల్, జామాయిల్, మొక్కజొన్న, కొబ్బరి పంటలు వేసి వచ్చిన ఫలసాయాన్ని నేటికి అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఒకసారి ప్రభుత్వానికి భూములు అమ్మి నష్టపరిహారం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో భూములపై హక్కు ఉండదని, అలాంటి భూములను సాగు చేసి ఫలసాయం పొందడం చట్ట విరుద్ధమని అన్నారు. రిజర్వాయర్ మిగులు భూములు దాదాపుగా 3500 ఎకరాలు ఉన్నాయని, ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకొని భూమిలేని దళితులు, గిరిజనులు, పేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సమస్యపై సీపీఎం గత 10 సంవత్సరాల నుంచి పోరాటం సాగిస్తుందని తెలిపారు. స్థానిక దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలబడేందుకు, హైకోర్టుతీర్పు ఆధారంగా సాగుచేసుకోమని చెప్పడానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, ఇతర జిల్లా నాయకులు సోమవారం టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోని ఎరక్రాలువ మిగులు భూముల్లో పర్యటన జరిపి, దున్ని, సాగుచేసే కార్యక్రమాన్ని చేపడతారన్నారు.

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు