
రైతులకు నాణ్యమైన నారు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలోని విశిష్ట రక్షిత సాగు పరిశోధన శిక్షణా కేంద్రంలో తయారుచేసిన నారును రైతులకు అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న నారు తదితర విషయాల గురించి బుధవారం వివరించారు. కూరగాయల ఉత్పత్తి నేలలో వ్యాధుల వల్ల దిగుబడి తగ్గుతుందన్నారు. ఇది రైతుల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందన్నారు. కూరగాయల పెంపకంలో కొత్త పద్ధతి గ్రాఫ్టెడ్ ఖ్యాతి పొందిందన్నారు. అంటుకట్టిన కూరగాయల నారు ద్వారా నేల ద్వారా సంక్రమించే వ్యాధులు ఉండవన్నారు. వంగ, టమాటా, మిరప పంటలకు కావాల్సిన నారును వర్సిటీలోని విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో పెంచుతున్నామని వీసీ చెప్పారు. అంటుకట్టిన నారును రైతుల అవసరాల మేర అందిస్తున్నామన్నారు. తెగుళ్ల నిరోధక శక్తి కలిగి, అంటు కట్టిన కూరగాయల నారు కావాలంటే 30 రోజులు ముందుగా ఈ కేంద్రంలో రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. సంప్రదాయ టమాట, మిరప వంగడాల కంటే గ్రాఫ్టెడ్ వంగడాల వాడకం వల్ల దిగుబడులు 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. వంగలో రెండింతల దిగుబడి పెరిగిందన్నారు. రైతులకు అంటు కట్టిన కూరగాయల మొక్కలు రూ.10కు ఇస్తామన్నారు. నారు కావాల్సిన వారు ఉద్యాన వన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రమేష్‌బాబు 94921 85716 నంబరులో సంప్రదించాలన్నారు.
ఉద్యాన వర్సిటీ వీసీ కె.గోపాల్