నరసాపురం రూరల్: సంతానోత్పత్తి కోసం నరసాపురం మండలం చినమైనవానిలంక ప్రాంతానికి వచ్చి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టగా.. గుడ్లను సంరక్షించి పొదిగిన తర్వాత 34 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అలా వచ్చి తీరంలో గుడ్లు పెడుతుండగా అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తున్నారు. ఫిబ్రవరి 3న తొలిసారిగా గుర్తించిన తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాగా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సముద్రంలోకి విడిచి పెట్టారు. సంరక్షణ కేంద్రంలో ఇప్పటివరకూ 135 తాబేళ్లు పెట్టిన 14,300 గుడ్లు సేకరించి భద్రపరిచినట్టు సిబ్బంది తెలిపారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె.రాంప్రసాద్, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
సముద్రంలోకి వెళుతున్న తాబేలు పిల్లలు
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్లు
తొలిసారిగా 34 తాబేలు పిల్లల విడుదల
సంరక్షించి.. సాగరంలో విడిచి..