నయీంనగర్/హన్మకొండ అర్బన్: కాళోజీ కళాక్షేత్రంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక, కళా సంస్థల కార్యక్రమాలకు ప్రత్యేక వేదికను కేటాయిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శనివారం కళాక్షేత్రంలోని ఆడిటోరియం, ఇతర విభాగాలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధుల సలహా మేరకు 150 నుంచి 200 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీన్, రామశాస్త్రి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వీఆర్ విద్యార్థి, జీవన్‌కుమార్ పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. డివిజన్, మండల స్థాయిల్లో ప్రజావాణి కార్యక్రమం యథా విధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
కాశిబుగ్గ: నగరంలోని ఎంజీఎం సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిని పరిశీలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనరసింహ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 30న సోమవారం రానున్నారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రిని పరిశీలించి ఇక్కడే వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పనుల పూర్తి, ఓపీ సేవలు, పూర్తిస్థాయిలో 24 అంతస్తుల ఆస్పత్రి ప్రారంభోత్సవం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎంజీఎంకు సంబంధించిన కొంతమంది సిబ్బందిని ఆదివారం కూడా కొత్త ఆస్పత్రికి హాజరు కావాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
న్యూశాయంపేట: మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకంలో భాగంగా సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ విభాగం సంక్షేమాధికారులు టి.రమేశ్, మేన శ్రీను శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 2026 ఫాల్ సీజన్‌కు సంబంధించి అర్హులైన మైనార్టీ విద్యార్థులు డిసెంబర్ 31లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.


