వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన కుందరు నాగేందర్‌రెడ్డి కుమార్తె ఆరాధన మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా ఎంపికైంది. ఆరాధన న్యాయశాఖలో ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు
కాళోజీ సెంటర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ టామ్‌కామ్ ద్వారా బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఓమన్, యూఏఈ దేశాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హతను బట్టి నెలకు రూ.40 వేల నుంచి రూ.2.02 లక్షల వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. డిగ్రీ, నర్సింగ్, బీఎస్సీ, డిప్లొమా, బీఈ (మెకానికల్) తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 08035524946, 040–23342040 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉదయశ్రీ ఎంపిక
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎడ్ల ఉదయశ్రీ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెడ్ మాస్టర్ లిక్కి రమేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయశ్రీని గురువారం హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఫిజికల్ డైరెక్టర్ కోట రాంబాబు తెలిపారు. ఉపాధ్యాయులు డి.రమేశ్, ఎం.రమేశ్, ఎస్.ఉమామహేశ్వర్, రవికుమార్, అబిద, గోపాల్‌రావు, భిక్షపతి, బుచ్చిరాములు, శైలజ, ఖాజామొయినొద్దీన్, జ్యోతి, విద్యార్థులు అభినందించారు.
సాగుకు సరిపడా విద్యుత్
పర్వతగిరి: సాగుకు సరిపడా విద్యుత్ అందించడానికి ప్రభుత్వం, విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్ఈ ఆనంద్ పేర్కొన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌కు గురువారం నూతన హైకెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లను అమర్చే కార్యక్రమంలో డీఈ దానయ్య, ఏడీఈ తిరుపతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూపతండాలో ఏర్పాటు చేసిన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయ అవసరాలకు సరిపడా విద్యుత్‌ను అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ దూల్య నాయక్, సిబ్బంది కిషన్, పూర్ణాచారి, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలి
సంగెం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని హౌసింగ్ పీడీ ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన సంగెం ఎంపీడీఓ కార్యాయాన్ని సందర్శించారు. గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పుడు ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా అని హౌసింగ్ ఏఈ, కంప్యూటర్ ఆపరేట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.72 వేలు అందిస్తున్నదని తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. అదనపు పీడీ శ్రీవాణి మాట్లాడుతూ గ్రామాల్లో వీబీజీ రాంజీ పథకంలో ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సురేశ్, ఎంపీడీఓ రవీందర్, హౌసింగ్ ఏఈ సంధ్య, ఆపరేటర్ శోభ తదితరులు పాల్గొన్నారు.


