కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, బోధనా విధానాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యా బోధనను పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఈ బృందాలు పనిచేయనున్నాయి. డీఈఓలు ప్రాధాన్యతా క్రమంలో బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపికై న సభ్యులు తమ పాఠశాలల నుంచి రిలీవ్ అయి తనిఖీ విధుల్లో చేరాలని, విధుల్లో చేరని వారి స్థానాల్లో వెంటనే ప్రత్యామ్నాయ సభ్యులను నియమించాలని స్పష్టం చేశారు.
మూడు గంటల పాటు తనిఖీలు
ప్రతి పాఠశాలలో తనిఖీ బృందం కనీసం మూడు గంటలు ఉండాలి. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను కనీసం 45 నిమిషాల పాటు ప్రత్యక్షంగా పరిశీలించాలి. విద్యార్థుల నెలవారీ టాస్క్షీట్లను తనిఖీ చేయడంతో పాటు ప్రాథమిక తరగతుల్లో కనీసం ఐదుగురు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అక్కడికక్కడే అంచనా వేయాలి. తెలుగు, ఉర్దూ, గణితం, ఆంగ్లం వంటి కీలక సబ్జెక్టుల్లో విద్యార్థుల చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను పరిశీలించాలి. బోధనా పద్ధతుల్లో మెరుగుదలకు సంబంధిత ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక సూచనలు, మార్గదర్శకత్వం అందించాలి. పాఠశాల తనిఖీ పూర్తయిన వెంటనే అకడమిక్ గైడ్స్ రిపోర్ట్ (ఏజీఆర్) రూపొందించి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఎఫ్ఎల్ఎన్ ) పాఠశాలలకు ప్రత్యేక విద్యాపరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించాలని విద్యాశాఖ ఆదేశించింది.
కలెక్టర్లు, డీఈఓల పర్యవేక్షణ
అకడమిక్ తనిఖీ బృందాల ఏర్పాటు, ఐఎస్ఎంఎస్ పోర్టల్లో మ్యాపింగ్, తనిఖీ నివేదికల అప్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్లు, డీఈఓలు పర్యవేక్షించనున్నారు. అమలులో లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని డెరెక్టర్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
నెలకోసారి తప్పనిసరి..
అకడమిక్ ప్యానల్ సభ్యులు తమకు కేటాయించిన ప్రతి పాఠశాలను నెలకు కనీసం ఒకసారి సందర్శించాలి. ఇందుకోసం డీఈఓలు, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారులు (ఏఎంఓలు) మండలాల వారీగా బృందాలను కేటాయించి, ఐఎస్ఎంఎస్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలి. మండలాల మ్యాపింగ్ పూర్తయిన తర్వాత పాఠశాలలు ఆటోమేటిక్గా ఆయా బృందాలకు కేటాయిస్తారు.
బోధన ప్రత్యక్ష పరిశీలన..
విద్యార్థుల సామర్థ్యాల అంచనా


